HomeతెలంగాణMidday meal scheme | మధ్యాహ్న భోజనంలో కప్ప కలకలం.. మహబూబ్‌నగర్ లాల్‌కోట పాఠశాలలో ఘటన

Midday meal scheme | మధ్యాహ్న భోజనంలో కప్ప కలకలం.. మహబూబ్‌నగర్ లాల్‌కోట పాఠశాలలో ఘటన

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఇటీవల వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యార్థులు తమ ఆహారంలో జీవరాశులు కనిపించాయని ఫిర్యాదులు చేయడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Midday meal scheme | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తినే ఆహారంలో జీవరాశులు, దుమ్ము, పురుగులు కనిపించడం తరచుగా వార్తల్లో నిలుస్తున్న నేపథ్యంలో తాజాగా మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లాలోని లాల్‌కోట జడ్పీ హైస్కూల్‌ లో క‌ప్ప క‌నిపించ‌డం కలకలం రేపింది.

సీసీకుంట మండలం లాల్‌కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో (Lalkota ZP High School) బుధవారం మధ్యాహ్నం విద్యార్థులకు అన్నం, పప్పు వడ్డిస్తున్న సమయంలో పప్పులో చనిపోయిన కప్ప కనిపించింది. సుమారు 270 మంది విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో కొందరు విద్యార్థులు ఈ దృశ్యం గమనించి వెంటనే భోజనం ఆపేశారు.

Midday meal scheme | త‌ల్లిదండ్రుల ఆగ్ర‌హం..

ఈ విషయం వారు తమ తల్లిదండ్రులకు తెలియజేయడంతో గ్రామంలో చర్చనీయాంశమైంది. అప్పటికే కొందరు విద్యార్థులు భోజనం చేసినట్లు సమాచారం. ఈ ఘటన పాఠశాల పరిధిలో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్థులు మధ్యాహ్న భోజనం నిర్వహకులపై, పాఠశాల యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరిస్తారు ? పిల్లల ఆరోగ్యంపై ఇంత నిర్లక్ష్యం ఎందుకు? అంటూ వారు మండిపడ్డారు. వార్త బయటకు పొక్కకుండా పాఠశాల హెడ్‌మాస్టర్, ఉపాధ్యాయులు ప్రయత్నించారని కూడా సమాచారం. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ..“లాల్‌కోట పాఠశాల మధ్యాహ్న భోజనంలో కప్ప (Frog) కనిపించినట్లు ఫిర్యాదు అందింది. గురువారం పాఠశాలకు వెళ్లి పూర్తి స్థాయి విచారణ చేపడతాం,” అని తెలిపారు.

ఎంఈవో మురళీకృష్ణ (MEO Muralikrishna)మాట్లాడుతూ.. ఇప్పటివరకు కప్ప కనిపించినట్లు ఆధారాలు లేవు. కొన్ని రూమర్స్ మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ పూర్తి సమాచారం సేకరించి దర్యాప్తు చేస్తాం,” అని అన్నారు. ఇటీవల మహబూబ్‌నగర్‌లోని బాదేపల్లి పాఠశాలలో జెర్రి, నారాయణపేటలోని మాగనూరు పాఠశాలలో పురుగులు ఉన్న భోజనం వడ్డించిన ఘటనలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఇప్పుడు లాల్‌కోట ఘటనతో మరోసారి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద ఈ ఘటన అధికారులు, నిర్వాహకులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని మరోసారి స్పష్టంగా చూపించింది. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై నిర్లక్ష్యం ప్రాణాంతకమవుతుందని తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు.