అక్షరటుడే, వెబ్‌డెస్క్: KCR-KTR flex banner | ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు YS Jagan బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లతో ఉన్న సత్సంబంధాలు మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. డిసెంబర్ 21న వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలో వెలిసిన ఓ ఫ్లెక్సీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఫ్లెక్సీలో జగన్‌తో పాటు కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు ఉండటంతో… ఇరు కుటుంబాల మధ్య కొనసాగుతున్న మైత్రి మరోసారి తెరపైకి వచ్చింది.
KCR-KTR flex banner | 2019 నుంచి కొనసాగుతున్న అనుబంధం
తెలుగు రాష్ట్రం విభజన తర్వాత వైఎస్ జగన్–కేసీఆర్‌ల KCR మధ్య రాజకీయ, వ్యక్తిగత సంబంధాలు బలపడిన విషయం తెలిసిందే. 2018లో తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో కేసీఆర్ సీఎం కాగా, 2019లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అఖండ విజయం సాధించి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు, పరస్పర పరామర్శలు కొనసాగుతున్నాయి.
జగన్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ హాజరుకావడం కూడా అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. కేసీఆర్ అనారోగ్యానికి గురైనప్పుడు వైఎస్ జగన్ స్వయంగా వెళ్లి పరామర్శించడం, అలాగే జగన్‌కు గాయమైన సందర్భాల్లో కేసీఆర్ కుటుంబం ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించడం వంటి ఘటనలు ఈ అనుబంధాన్ని మరింత బలపరిచాయి.
జగన్ బర్త్‌డే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఫ్లెక్సీలు, కటౌట్లతో సంబరాలకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసం, కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక కటౌట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ఫ్లెక్సీలో మధ్యలో జగన్ సమరశంఖం పూరిస్తుండగా, ఒకవైపు కేసీఆర్, కేటీఆర్ KTR చిరునవ్వులతో కనిపిస్తున్నారు. ఈ కాంబినేషన్ రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఫ్లెక్సీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వైసీపీ, బీఆర్ఎస్ మధ్య గతంలో అనుసరించిన రాజకీయ వ్యూహాలు, పథకాల అమలు విధానాల్లో పోలికలు ఉన్నాయనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 2023లో తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోగా, 2024లో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఓటమి పాలైంది. అయినప్పటికీ ఇరు పార్టీల మధ్య ఉన్న స్నేహ సంబంధాలు మాత్రం తెగలేదన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది