అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kalvakuntla Kavitha New Party | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ముహూర్తం ఖరారు అయింది. మేలో పార్టీని ప్రకటిస్తానని ఆమె తెలిపారు. గురువారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు.
బీఆర్ఎస్ (BRS) నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత తెలంగాణ జాగృతిపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. జాగృతి సంస్థను బలోపేతం చేస్తూనే కొత్త పార్టీ ఏర్పాటు కోసం ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేశారు. మే మొదటి వారంలో పార్టీ ప్రకటించాలని చూస్తున్నట్లు తెలిపారు. మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.
Kalvakuntla Kavitha New Party | అధికారంలోకి వస్తాం
కవిత కొద్ది రోజులుగా మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao)పై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. బతుకమ్మ వేడుకల్లో సైతం ఆమె తన తండ్రి స్వగ్రామం అయిన చింతమడకలో పాల్గొన్నారు. హరీశ్‌రావును గుంట నక్క అని పలుమార్లు విమర్శించారు. ఈ క్రమంలో తాజాగా తాను అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) సిద్దిపేట నుంచి పోటీ చేస్తానని కవిత ప్రకటించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ ఉండవన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా జాగృతి ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో తాము పక్కా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.వైఎస్ షర్మిల (YS Sharmila)ను కవిత ఇందిరా గాంధీతో పోల్చారు. ఏపీలో షర్మిల ఫెయిల్ అవ్వలేదన్నారు. ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసి ఇప్పుడు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు అయిందని చెప్పారు. లీడర్‌కి జెండర్ బేధాలు ఉండవన్నారు. ఇందిరా గాంధీ ఒక పవర్ ఫుల్ లీడర్ అని పేర్కొన్నారు.
Kalvakuntla Kavitha New Party | సచివాలయాన్ని ముట్టడిస్తాం
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. వెయ్యి మంది ఆర్టీసీ కార్మికులను సంస్థ అన్యాయంగా తీసేసిందన్నారు. జాగృతి డిమాండ్ చేస్తే అందులో 300 మందిని మాత్రమే తిరిగి విధుల్లో చేర్చుకున్నారని చెప్పారు. మిగిలిన వారిని కూడా త్వరితగతిన చేర్చుకోకపోతే ఈనెల 24న కార్మికులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆర్టీసీని ప్రభుత్వం (RTC Government)లో విలీనం చేయాలన్నారు.
Kalvakuntla Kavitha New Party | కార్మికులపై పనిభారం
మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme)తో బస్సుల్లో ఆక్యూపెన్సీ పెరిగిందని కవిత చెప్పారు. దీంతో కార్మికులు పనిభారంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి తగిన విశ్రాంతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్రమ దోపిడీకి పాల్పడుతున్న ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ఆదుకోవడం లేదని విమర్శించారు. చిన్న చిన్న కారణాలతో డ్రైవర్లు, కండక్టర్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీకి ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత చెల్లించిందో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌చేశారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు.