HomeతెలంగాణBC Reservations | స్థానిక ఎన్నికలపై హైకోర్టు సంచలన నిర్ణయం.. నోటిఫికేషన్​పై స్టే

BC Reservations | స్థానిక ఎన్నికలపై హైకోర్టు సంచలన నిర్ణయం.. నోటిఫికేషన్​పై స్టే

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్​ 9పై స్టే ఇచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్​ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: BC Reservations | స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు సంచలన lనిర్ణయం వెలువరించింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్​ 9పై స్టే ఇచ్చింది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్​పై సైతం స్టే విధిస్తూ నాలుగు వారాల్లో కౌంటర్​ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల బుధవారం నుంచి సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా కులగణన (Caste Census) చేపట్టి రిజర్వేషన్​ అమలు చేసినట్లు అడ్వకేట్​ జనరల్​ సుదర్శన్​రెడ్డి (AG Sudarshan Reddy) కోర్టుకు తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై గురువారం ఆయన వాదనలు వినిపించారు. బీసీ కుల గణన చేపట్టాలని కేబినెట్​ నిర్ణయించిందన్నారు. సర్వేలో బీసీ జనాభా 57.6 శాతం ఉందని తేలిందన్నారు. కులగణన మేరకు బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిందన్నారు. ఆ బిల్లును రాష్ట్రపతి పెండింగ్​లో పెట్టారన్నారని చెప్పారు. తమిళనాడు కేసులో సుప్రీం తీర్పు ప్రకారం రాష్ట్రపతి బిల్లు పెండింగ్​లో పెట్టడంతో ఆమోదం పొందినట్లే అని ఏజీ తెలిపారు. రాష్ట్రపతి బిల్లుకు ఆమోదం తెలిపి ఉంటే ప్రభుత్వం నోటిఫై చేసి ఉండేదన్నారు. అయితే రాష్ట్రపతి ఆమోదం తెలపకపోవడంతో ప్రభుత్వం నోటిఫై చేయాల్సిన అవసరం లేదని వాదించారు.

BC Reservations | మొత్తం ఆరు పిటిషన్లపై..

స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. ఆయనతో పాటు పలువురు ఇంప్లిడ్​ పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే రిజర్వేషన్లకు మద్దతుగా కూడా ఆర్​ కృష్ణయ్య, ఇతరులు పిటిషన్లు వేశారు. మొత్తం ఆరు పిటిషన్లపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్లు, ప్రభుత్వం తరఫు వాదనలు విన్న ధర్మాసనం విచారణను గురువారం మధ్యాహ్నం 2:15 గంటలకు వాయిదా వేసింది. గురువారం ప్రభుత్వం తరఫున ఏజీతో పాటు రవివర్మ వాదనలు వినిపించారు.

BC Reservations | రాజ్యాంగంలో ఎక్కడా లేదు

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 50శాతం రిజర్వేషన్లు దాటొద్దని పిటిషనర్లు పేర్కొన్నారు. గవర్నర్ (Governor)​ దగ్గర బిల్లు పెండింగ్​లో ఉండగా జీవో తీసుకొచ్చారని పిటిషనర్లు బుధవారం వాదించారు. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రిజర్వేషన్ అమలు చేస్తోందని పేర్కొన్నారు. ట్రిపుల్‌ టెస్ట్‌ (Triple Test)ను పాటించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లపై చట్టం చేయలేవని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై గురువారం రవివర్మ వాదనలు వినిపిస్తూ.. 50 శాతం మించి రిజర్వేషన్ల పెంపునకు సరైన కారణాలు ఉన్నాయన్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అయితే పిటిషనర్లు, ప్రభుత్వం వాదనలు విన్న న్యాయస్థానం జీవో నంబర్​ 9పై స్టే విధించింది. దీంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ నిలిచిపోనుంది. నాలుగు వారాల్లో కౌంటర్​ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, రెండు వారాల్లో కౌంటర్​ వేయాలని పిటిషన్​కు సూచించింది. హైకోర్టు ఆర్డర్​ కాపీ వచ్చాక ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకటించనుంది.