అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఐదో తరగతి విద్యార్థితో పారిపోయిన ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న పూనాగం ప్రాంతం నుంచి 11 ఏళ్ల బాలుడిని తీసుకుని పారిపోయిన సదరు ఉపాధ్యాయురాలిని రాజస్థాన్ సరిహద్దులోని షామ్లాజీ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా వారు ఉన్న స్థలాన్ని గుర్తించిన పోలీసులు, బస్సులో విద్యార్థితో కలిసి వెళ్తుండగా ఆమెను అరెస్టు చేశారు. బాలుడిని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
POCSO case : అసలేం జరిగిందంటే..
పోలీసుల కథనం ప్రకారం.. టీచర్, విద్యార్థి కలిసి నాలుగు రోజుల పాటు వడోదర, జైపూర్, అహ్మదాబాద్, ఢిల్లీ, బృందావన్ వంటి ప్రాంతాల్లో తిరిగారు. సుమారు 2,200 కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ ప్రయాణంలో బాలుడిని సదరు ఉపాధ్యాయురాలు వేధించినట్లు పోలీసులు తెలిపారు.
POCSO case : ఉపాధ్యాయురాలి వాంగ్మూలం..
ఉపాధ్యాయురాలు సైతం తన వాంగ్మూలంలో బాలుడిని శారీరకంగా వేధించినట్లు అంగీకరించిందని డీసీపీ (సూరత్ సిటీ) భగీరథ్ గర్వి తెలిపారు. ప్రయాణించే క్రమంలో ఉపాధ్యాయురాలు, టీచర్ కలిసి రెండు హోటళ్లలో రాత్రి బస చేశారన్నారు. ఈ మేరకు ఆమెపై పోక్సో చట్టం, భారత న్యాయసంహితలోని సెక్షన్ 127 కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఇద్దరికీ వైద్య పరీక్షలు జరుగుతున్నాయన్నారు. సూరత్ నుంచి పారిపోయే ముందు రైలు ఎక్కే సమయంలో టీచర్ తన ఫోన్‌ను స్విచ్చాఫ్ చేసినట్లు తెలిపారు. ఆ టీచర్ కు సంబంధించిన రెండో ఫోన్‌ను ట్రాక్ చేసి, లొకేషన్ గుర్తించి డీసీపీ చెప్పారు.
POCSO case : సీసీటీవీ ఫుటేజీతో..
సూరత్‌లోని పూనాగం ప్రాంతంలో ఉన్న ఒక హిందీ మీడియం పాఠశాలలో సదరు ఉపాధ్యాయురాలు పని చేస్తుంది. ఈ క్రమంలోనే బాధిత విద్యార్థిని లోబర్చుకుంది. ఆ బాలుడికి మూడేళ్లపాటు ప్రైవేటు ట్యూషన్ సైతం చెప్పింది. అలా ఇద్దరి మధ్య సంబంధం మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 25న మధ్యాహ్నం బాలుడు తన ఇంటి బయట ఆడుకుంటూ అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా అసలు విషయం వెలుగు చూసింది.
బాలుడు అదృశ్యం కావడానికి కొంత సమయం ముందు తనకు ట్యూషన్ చెప్పే టీచర్‌తో మాట్లాడినట్లు తేలింది. దీనిపై అదే రోజున సూరత్‌లోని పూనా ఠాణాలో కిడ్నాప్ కేసు నమోదైంది. సూరత్ రైల్వే స్టేషన్‌లోనూ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ‘బుక్ మై ట్రిప్’ యాప్ నుంచి సదరు ఉపాధ్యాయురాలు టూర్‌కు సంబంధించిన అన్ని బుకింగ్స్ చేసినట్లు నిర్ధారణ అయింది.