అక్షరటుడే, వెబ్డెస్క్ : Mobile Recharges | సంవత్సరం చివరిలో లేదా కొత్త సంవత్సరం ప్రారంభంలో మొబైల్ వినియోగదారుల ఖర్చులు మరింత పెరగనున్నాయి. ప్రముఖ టెలికాం సంస్థలు (Telecom Companies) రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel), వొడాఫోన్-ఐడియా (Vodafone-Idea) మరోసారి రీఛార్జ్ టారిఫ్‌లను పెంచడానికి సన్నాహాలు చేస్తున్నాయని సమాచారం.
నివేదికల ప్రకారం, ఈ మూడు కంపెనీలు రాబోయే ఒకటి లేదా రెండు నెలల్లో తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను సుమారు 10 శాతం వరకు పెంచవచ్చని అంచనా. దీంతో వినియోగదారులపై అదనపు భారంగా మారే అవకాశం ఉంది.
Mobile Recharges | ఎక్కువ భారం..
అధికారిక ప్రకటన వెలువడకపోయినా, జియో (Jio) మరియు ఎయిర్‌టెల్ (Airtel) ఇప్పటికే కొన్ని రీఛార్జ్ ప్లాన్‌లలో మార్పులు చేసినట్లు తెలిసింది. కొన్ని ప్లాన్‌ల ధరలు పెంచగా, మరికొన్ని ప్లాన్‌ల వాలిడిటీ (చెల్లుబాటు కాలం) తగ్గించారు. ఉదాహరణకు, జియో 1GB రోజువారీ బేస్ ప్లాన్ ధర రూ.249 నుంచి రూ.299కు పెంచింది. అదే విధంగా, ఎయిర్‌టెల్ కూడా తమ బేస్ ప్లాన్‌లో మార్పులు చేసింది. టారిఫ్ పెంపు వెనుక ప్రధాన కారణాలుగా కంపెనీలు 5G నెట్‌వర్క్ నిర్మాణం, నిర్వహణ ఖర్చులు, ఫైబర్ విస్తరణ, స్పెక్ట్రం ఫీజులు వంటి అంశాలను చూపుతున్నాయి.
అంచనా ప్రకారం, ఈ సుంకాల పెంపు డిసెంబర్ 2025 నుంచి జూన్ 2026 మధ్యలో అమల్లోకి రావచ్చు. జేపీ మోర్గాన్ తాజా నివేదిక ప్రకారం, జియో తన రీఛార్జ్ ధరలను 15 శాతం వరకు పెంచే అవకాశం ఉందని, ఎయిర్‌టెల్ మరియు Vi కూడా అదే దారిలో నడుస్తాయని సూచిస్తోంది. టెలికాం రంగంలో ఈ మార్పులు అమల్లోకి వస్తే, వినియోగదారులు తమ నెలవారి మొబైల్ బిల్లులు, డేటా ఖర్చుల విషయంలో మరోసారి పునరాలోచించాల్సి ఉంటుంది. పెరగనున్న ఈ ధరల వల్ల సామాన్యులపై ఎక్కువగా భారం పడే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.
