అక్షరటుడే, భీమ్గల్: Janasena Telanagana | మున్సిపల్ ఎన్నికల సమరంలో జనసేన పార్టీ (Janasena party) దూకుడును ప్రదర్శిస్తోంది. భీమ్గల్ మున్సిపాలిటీలో (Bheemgal Municipality) జనసేన అభ్యర్థులను గెలిపించుకోవడమే లక్ష్యంగా పార్టీ అభ్యర్థులను ఖరారు చేస్తూ, ఆదివారం వారికి బీఫాంలను నాయకులు అందజేశారు. బాల్కొండ నియోజకవర్గ సమన్వయకర్త శివసారి ఫణీంద్ర, భీమ్గల్ మున్సిపల్ కోఆర్డినేటర్ డా. శ్రీకాంత్ రామావత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది.
Janasena Telanagana | బరిలో నిలిచిన అభ్యర్థులు వీరే..
1వ వార్డునుంచి విశ్వనాథం సుమలత, 4వ వార్డు నుంచి బచల్వార్ మాధవి, 5వ వార్డు బరిలో ఆకుల సబితకు బీఫాంలను అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త శివసారి ఫణీంద్ర మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను నమ్మి ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చిన అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. అభివృద్ధికి దూరమైన భీమ్గల్ను ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత జనసేన తీసుకుంటుందని, అవినీతి రహిత పాలన కోసం గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
Janasena Telanagana | భీమ్గల్ భవిష్యత్తు కోసం పోరాడాలి..
భీమ్గల్ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీకాంత్ రామావత్ మాట్లాడుతూ.. అభ్యర్థులందరూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవాలన్నారు. జనసేన సైనికులుగా భీమ్గల్ భవిష్యత్తు కోసం పోరాడాలని దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో జనసేన విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు గణేష్ తేజ, నాయకులు అర్జున్, దిలీప్, జనసేన పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.