అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jaggareddy Election Controversy | కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy)పై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం మున్సిపల్ ఎన్నికలు (Municipal elections) జరిగిన విషయం తెలిసిందే. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సంగారెడ్డి (Sangareddy)లో సైతం పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో జగ్గారెడ్డి వచ్చి పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Jaggareddy Election Controversy | ఏం జరిగిందంటే?
సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు రిగ్గింగ్ చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ విషయంలో పోలీసులతో వాగ్వాదం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్త కాలర్‌ను సీఐ పట్టుకున్నారన్న సమాచారంతో జగ్గారెడ్డి పోలింగ్ బూత్‌కు వచ్చారు. పోలింగ్ ఆపేస్తా అంటూ పోలింగ్ బూత్‌లోకి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు, జగ్గారెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. సదరు సీఐని రాయలేని భాషలో జగ్గారెడ్డి తిట్టారు. అక్కడే ఉన్న పోలీసులు సముదాయించే యత్నం చేసినా ఆయన వినిపించుకోలేదు. ఈ విషయం ఎన్నికల సంఘం (Election Commission) దృష్టికి వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. జగ్గారెడ్డిపై కేసు నమోదు చేయాలని సంగారెడ్డి ఎస్పీని ఆదేశించింది.
Jaggareddy Election Controversy | స్పందించిన జగ్గారెడ్డి
సంగారెడ్డిలో జరిగిన వివాదంపై జగ్గారెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ హయాంలో దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆరోపించారు. ఒక్కో వార్డులో 300కు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని, వాటిని మున్సిపల్ ఎన్నికల్లో వేయడానికి యత్నించారన్నారు. దొంగ ఓట్లు వేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారని చెప్పారు. అలా అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్త గల్లాను సీఐ శివకుమార్ పట్టుకున్నారని చెప్పారు. దీంతో తాను అక్కడికి వెళ్లానని .. గొడవ జరిగిందన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆ దొంగ ఓట్లను ఎందుకు తొలగించలేదని ఆయన ప్రశ్నించారు. ఈ గొడవ జరగడానికి ఈసీ, జిల్లా అధికారులు బాధ్యులు కారా అన్నారు.