అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Chiranjeevi | ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు ఆయన లేఖ విడుదల చేశారు.
గతంలో సినీ ప్రముఖులు అప్పటి సీఎం జగన్ (YS Jagan)ను కలిసిన సమయంలో ఆయన అవమానించారని కామినేని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయంలో బాలకృష్ణ స్పందిస్తూ.. జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వివాదంపై చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆహ్వానం మేరకే తాను వెళ్లినట్లు చెప్పారు. అసెంబ్లీలో తన పేరు ప్రస్తావనకు రావడంతో వివరణ ఇస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. ఆ సమయంలో కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తనకు వద్దకు వచ్చి సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని చర్చించారని ఆయన పేర్కొన్నారు.
Chiranjeevi | సినీ పరిశ్రమ ఇబ్బందులను వివరించా
సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయమై తాను అప్పటి సినీమాటోగ్రఫీ మంత్రి పేర్ని (Perni Nani) నానితో ఫోన్లో మాట్లాడినట్లు చిరు చెప్పారు. అయితే తర్వాత మంత్రి ఫోన్ చేసి ముఖ్యమంత్రి తనను కలుస్తామన్నారని, లంచ్‌కు రావాలని చెప్పారని పేర్కొన్నారు. దీంతో ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి వెళ్లినట్లు చిరంజీవి స్పష్టం చేశారు. లంచ్ చేస్తున్న సమయంలో సినీ పరిశ్రమ ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకు వెళ్లానన్నారు. సమయం ఇస్తే అందరం వచ్చి కలుస్తామని చెప్పానన్నారు. దీంతో కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్ని నాని ఫోన్ చేసి రమ్మనట్లు ఆయన తెలిపారు.
Chiranjeevi | బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు
కోవిడ్ కారణంగా ఐదుగురినే రమ్మన్నారని, అయితే తాము 10 వస్తామని చెప్పడంతో జగన్ సరేనన్నారని తెలిపారు. అప్పుడు తాను బాలకృష్ణను ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదన్నారు. దీంతో తాను ఆర్ నారాయణమూర్తి, మరికొంత మందితో కలిసి వెళ్లి జగన్‌ను కలిసినట్లు చిరు తెలిపారు. అక్కడ జగన్ తమను సాదరంగా ఆహ్వానించారని చిరంజీవి చెప్పారు. సినీ పరిశ్రమ సమస్యలను ఆయనకు వివరించామన్నారు. పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరామన్నారు. అప్పుడు తాను చొరవ తీసుకోవడంతోనే ప్రభుత్వం టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించిందని తెలిపారు.