అక్షరటుడే, వెబ్డెస్క్ : ISRO | అంతరిక్ష పరిశోధనల్లో కీలక ముందడుగు వేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సన్నాహాలు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో అత్యంత ఎత్తయిన, శక్తివంతమైన తొలి రాకెట్ నిర్మాణానికి ప్రణాళికలు వేస్తోంది.
ఏకంగా 40 అంతస్తుల భవనం అంత ఉండే భారీ రాకెట్ (Heavy Rocket) నిర్మాణ పనిలో నిమగ్నమైనట్లు ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ (ISRO Chairman V. Narayanan) వెల్లడించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన.. 75వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను తక్కువ భూమి కక్ష్య (LEO)లోకి మోసుకెళ్లడానికి గాని దీన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు.
ISRO | 17 టన్నుల నుంచి 75 టన్నుల వరకు..
డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం (Abdul Kalam) మొట్టమొదటి రూపొందించిన స్వదేశీ రాకెట్ కేవలం 17 టన్నుల లిఫ్ట్ అప్ బరువుతో 35 కిలోల ఉపగ్రహాన్ని లో ఎర్త్ ఆర్బిట్ లోకి చేర్చిందన్నారు. అలా మొదలైన మన ప్రయాణం ఇప్పుడు 75 టన్నుల మోసుకెళ్లగల రాకెట్లను రూపొందించే స్థాయికి చేరుకున్నామన్నారు. “మేము ఇప్పుడు 75 వేల కిలోల బరువును కక్ష్యలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యం గల 40 అంతస్తుల ఎత్తు గల రాకెట్ను నిర్మిస్తున్నామని ” నారాయణన్ తెలిపారు. ఇది భారతదేశ సాంకేతిక పురోగతిలో గొప్ప ముందడుగు అని ఆయన అభివర్ణించారు.
N1 అని పిలువబడే ఈ “సూపర్-హెవీ” రాకెట్ భవిష్యత్ హెవీ-లిఫ్ట్ కార్యకలాపాలకు వెన్నెముకగా మారుతుందని భావిస్తున్నారు. NAVIC ఉపగ్రహ కూటమి ద్వారా భారతదేశం GPS ప్రత్యామ్నాయాన్ని మెరుగుపరచనున్నట్లు తెలిపారు. GSAT-7కి ప్రత్యామ్నాయంగా భారత నావికాదళం యొక్క కొత్త కమ్యూనికేషన్ ఉపగ్రహం GSAT-7Rను కక్ష్యలోకి పంపించనున్నట్లు వివరించారు.
ప్రస్తుతం, భారతదేశం కమ్యూనికేషన్, నావిగేషన్, రక్షణ, వాతావరణం, భూమి పరిశీలన కోసం దాదాపు 55 ఉపగ్రహాలు తక్కువ భూ కక్షలో ఉన్నాయని, దేశీయ, వాణిజ్య ప్రయోగాలను పెంచడం ద్వారా రాబోయే నాలుగు సంవత్సరాలలో ఈ సంఖ్యను మూడు రెట్లు పెంచే ప్రణాళికను నారాయణన్ వివరించాడు. సూపర్-హెవీ రాకెట్ల రేసులోకి ప్రవేశించడం ద్వారా NASA, స్పేస్ఎక్స్ స్టార్షిప్ వంటి సంస్థలకు దీటుగా అత్యంత అధునాతన అంతరిక్ష ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.
ఆరు దశాబ్దాల క్రితం 35-కిలోల పేలోడ్లను ప్రయోగించడం నుంచి మొదలై ఇస్రో ప్రయాణం ఇప్పుడు 75 టన్నుల మెగా-రాకెట్ను రూపొందించే స్థాయికి ఎదిగింది. ఒకప్పుడు విదేశీ లాంచర్లపై ఆధారపడిన ఇస్రో.. స్వతహాగా అభివృద్ధి చెందింది. చంద్రయాన్-3 ద్వారా చంద్రుడిపై దక్షిణ ధ్రువంలో సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. అత్యంత తక్కువ ఖర్చుతో మంగళయాన్ (Mangalyaan) మార్స్ ఆర్బిటర్ ను విజయవంతంగా ప్రయోగించిన ఘనతను సంపాదించింది. ప్రపంచ అంతరిక్ష రంగంలో 75 టన్నుల రాకెట్ ప్రయోగం ద్వారా ఇస్రో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది.