అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Israel-Hamas | ఇజ్రాయెల్–హమాస్ మధ్య యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దేశాల మధ్య శాంతి కోసం కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (US President Trump) ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
యుద్ధం ముగింపు కోసం ట్రంప్ 20 సూత్రాల ప్రణాళికను తీసుకు వచ్చారు. దీనిలో భాగంగా ఇజ్రాయెల్ బందీలను హమాస్ తక్షణమే విడిచిపెట్టాలి. ఇందుకు హమాస్ అంగీకరించింది. తాజాగా యుద్ధం ముగించేందుకు ఇజ్రాయెల్ (Israel), హమాస్ (Hamas) ముందుకు వచ్చినట్లు ట్రంప్ ప్రకటించారు. రెండు దేశాలు మొదటి దశ శాంతి ఒప్పందానికి అంగీకరించాయని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇదో గొప్ప అడుగుగా ఆయన అభివర్ణించారు.
Israel-Hamas | త్వరలోనే బందీల విడుదల
శాంతి ఒప్పందానికి రెండు పక్షాలు అంగీకరించినందుకు గర్వంగా ఉందని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారు త్వరలో విడుదల అవుతారని తెలిపారు. అంతేగాకుండా గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనక్కి వస్తాయని చెప్పారు. శాంతి నెలకొల్పే చర్యల్లో భాగంగా సైనికుల ఉపసంహరణ తొలి అడుగని ఆయన పేర్కొన్నారు.
Israel-Hamas | రెండేళ్లపాటు యుద్ధం
ఇజ్రాయెల్ – హమాస్ మధ్య రెండేళ్లుగా యుద్ధం సాగుతోంది. దీంతో లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. వేలాది మంది చనిపోయారు. 2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేశారు. అంతేగాకుండా ఇజ్రాయెల్లోకి చొరబడి 1,200 మందిని హతమార్చారు. మరో 250 మందిని బందీలుగా తీసుకు వెళ్లారు. దీంతో హమాస్‌ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. గాజాపై టెల్ అవీవ్ యుద్ధ విమానాలు, క్షిపణులతో విరుచుకు పడింది. అంతేగాకుండా ఐడీఎఫ్ దళాలు హమాస్ ముఖ్య నేతలను హతమార్చాయి. ఈ యుద్ధంలో 67 వేలమందికిపైగా పాలస్తీనీయులు చనిపోగా.. దాదాపు 1.70 లక్షల మంది గాయపడ్డారు. వేలాది భవనాలు నేలకూలాయి.
Israel-Hamas | గొప్ప రోజు..
తాజాగా శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు (Netanyahu) స్పందించారు. ఇది ఇజ్రాయెల్‌కు గొప్ప రోజు అన్నారు. బందీలను ఇళ్లకు చేర్చేందుకు ప్రభుత్వాన్ని సమావేశపరుస్తానని చెప్పారు. గాజాలో యుద్ధాన్ని ఆపేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని హమాస్ పేర్కొంది. ఒప్పందం కుదరడంలో కీలకంగా వ్యవహరించిన దేశాలకు ధన్యవాదాలు తెలిపింది.