అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indiramma Houses | పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం తీసుకొచ్చింది. ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేయగా ఇళ్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. అయితే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకంలో కొందరు అధికారులు చేతివాటం చూపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Illu) లబ్ధిదారుల నుంచి అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేగాకుండా స్థానిక నాయకులు సైతం వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఇలాంటి చర్యలపై తీవ్రంగా స్పందించింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇదివరకే హెచ్చరించింది. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో అవకతవకలు జరగడంతో ఓ పంచాయతీ కార్యకదర్శిపై అధికారులు వేటు వేశారు.
Indiramma Houses | మంత్రి ఉత్తమ్ ఆగ్రహం
హుజుర్‌నగర్ (Huzur Nagar) నియోజకవర్గ పరిధిలోని జానపహాడ్‌లో ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులో అవకతవకలు జరిగినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) దృష్టికి వచ్చింది. దీంతో ఆయన తీవ్రంగా స్పందించారు. సదరు గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంకటయ్యను సస్పెండ్ చేయడంతో పాటు ఏసీబీ కేసు (ACB Case) నమోదు చేయాలని కలెక్టర్‌ను ఆయన ఆదేశించారు. దీంతో కలెక్టర్ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏసీబీ అధికారులు సైతం ఆయనపై కేసు నమోదు చేశారు.
