అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | ఆటోల చోరీకి పాల్పడిన కేసులో ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు.
నాగిరెడ్డిపేట మండలం (Nagireddypet mandal) గోపాల్పేట గ్రామంలో ఈనెల 11న అర్ధరాత్రి గ్రామానికి చెందిన తాడేపల్లి కృష్ణకు సంబంధించిన టీఎస్ 15యూసీ 4621 నంబరు బజాజ్ ప్యాసింజర్ ఆటోను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మాల్తుమ్మెద శివారులో శనివారం పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకుని విచారించారు. పోలీసుల విచారణలో (police investigation) నాగిరెడ్డిపేట మండలంలో చోరీ చేసిన ఆటో, మెదక్ జిల్లాలో (Medak district) చోరీ చేసిన రెండు ఆటోలు, భిక్కనూర్లో చోరీ చేసిన ఆటో మొత్తం నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
నిజామాబాద్ జిల్లా (Nizamabad district) మోపాల్ మండలం మంచిప్ప గ్రామానికి చెందిన కనుగుల(కుమ్మరి) రాజు, నిజామాబాద్ మండలం గూపన్పల్లి గ్రామానికి చెందిన కొల్ల దుర్గారాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 2.45 లక్షల విలువ చేసే నాలుగు ఆటోలను, 2 మొబైళ్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. ఇందులో కనుగుల రాజుపై కరీంనగర్ జిల్లాలో 12, జగిత్యాలలో 3, నిజామాబాద్ జిల్లాలో 3, కామారెడ్డి, మెదక్ జిల్లాలో ఒకటి చొప్పున మొత్తం 20 కేసులు ఉన్నాయన్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన నాగిరెడ్డిపేట పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.