అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Instagram Hashtags | ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ కీలక నిర్ణయం తీసుకుంది. హ్యాష్‌ట్యాగ్‌ల వినియోగంపై పరిమితి విధించింది. ఇప్పటి నుంచి ఒక్క పోస్ట్‌కు గరిష్టంగా ఐదు హ్యాష్‌ట్యాగ్‌లు పెట్టుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఎంతో మంది ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు. చాలా మంది రీల్స్ చేస్తూ సోషల్ మీడియా (Social Media)లో ఫేమస్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. యూజర్లకు రీచ్ కావడానికి రీల్స్, పోస్టులు చేసేవారు హ్యాష్‌ట్యాగ్ ఇస్తారు. గతంలో 30 వరకు హ్యాష్‌ట్యాగ్‌లు ఇచ్చే అవకాశం ఉండేది. అయితే శుక్రవాంర ఇన్స్టాగ్రామ్ తన ప్లాట్ఫామ్లో కంటెంట్ డిస్కవరీ (Content Discovery)కి పరిమితిని ప్రకటించింది. రీల్, పోస్ట్‌కు జోడించగల హ్యాష్‌ట్యాగ్‌ల సంఖ్యపై పరిమితిని అమలు చేస్తోంది. తక్కువ హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించడంతో కంటెంట్ డిస్కవరీ, పనితీరులో సృష్టికర్తలకు గణనీయంగా సహాయపడుతుందని సంస్థ ప్రకటించింది.
Instagram Hashtags | పనితీరు మెరుగు
క్రియేటర్స్ ఖాతా (Creators Account) ద్వారా ఇన్స్టాగ్రామ్ ఈరోజు నుంచి రీల్, పోస్ట్‌లో ఐదు హ్యాష్‌ట్యాగ్ లను అనుమతిస్తుందని కంపెనీ ప్రకటించింది. సాధారణ హ్యాష్‌ట్యాగ్‌ల కంటే తక్కువ, ముఖ్యమైన హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్ పనితీరు, ప్రజల అనుభవం రెండింటినీ మెరుగుపరుస్తుందని తెలిపింది. కంటెంట్ క్రియేటర్లు ఉపయోగించే హ్యాష్‌ట్యాగ్‌లతో మరింత ఉద్దేశపూర్వకంగా ఉండాలని, వారు ప్రచురిస్తున్న కంటెంట్‌కు సంబంధించిన వాటిపై దృష్టి పెట్టాలని సూచిస్తుంది. చాలామంది సాధారణంగా ఉపయోగించే #reels లేదా #explore వంటి జెనెరిక్ హ్యాష్‌ట్యాగ్‌లు సహాయ పడవని స్పష్టం చేసింది. ఇవి కంటెంట్ పనితీరును దెబ్బతీస్తాయని కంపెనీ తెలిపింది.