అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indonesia | ఇండోనేషియాలో దారుణం జరిగింది. తూర్పు జావా ప్రావిన్స్‌లోని సిడోర్జో పట్టణంలో (Sidorjo Town) ఒక ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్ భవనం కూలిపోవడం వల్ల భారీ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు.
ఈ ఘటన ‘అల్ ఖజోని’ (Al Khazani) ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్లో జరిగింది. నిర్మాణంలో ఉన్న ఈ భవనంలో విద్యార్థులు ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా భవనం కూలిపోయింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. 100 మంది పిల్లల వరకు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 8 మందిని ప్రాణాలతో బయటకు తీశారు. అయితే రెస్క్యూ బృందం (Rescue Team) చెబుతున్న దాని ప్రకారం అనేక మృతదేహాలు కనిపించాయి.
Indonesia | రెస్క్యూ ఆలస్యంగా ప్రారంభం
ప్రమాదం జరిగిన ఎనిమిది గంటల తర్వాతనే పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనివల్ల శిథిలాల కింద ఉన్నవారి ప్రాణాలను కాపాడే అవకాశాలు మరింత తగ్గిపోయాయి. విద్యార్థులు ప్రార్థనల్లో పాల్గొంటుండగా ఈ ప్రమాదం జరగడంతో, అనేకమంది చిన్నారులు భవనం (Islamic Boarding School Building) లోపలే ఉండిపోయారు. రెస్క్యూ బృందం తెలిపిన వివరాల ప్రకారం.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే అధిక లోడ్‌తో కట్టిన ఈ బిల్డింగ్ నిర్మాణంలో లోపాలు ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం విచారణ ప్రారంభమైంది.
ఈ విషాద ఘటనపై ఇండోనేషియా ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయం అందించాలని కోరుతున్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని అందరు ప్రార్ధిస్తున్నారు.