అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indigo Vouchers | దేశంలో ఇటీవల ఇండిగో సంక్షోభంతో వేలాది విమానాలు రద్దయిన విషయం తెలిసిందే. ఎలాంటి సమాచారం లేకుండా విమానాలను రద్దు చేయడంతో ప్రయాణికులు (Passengers) తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇండిగో సంక్షోభంతో ఎంతో మంది నష్టపోయారు. చాలా మంది ప్రయాణికులకు సంస్థ ఇప్పటికే టికెట్ డబ్బులను రీఫండ్ చేసింది. తాజాగా నష్టపోయిన ప్రయాణికులకు వోచర్లు అందజేస్తోంది. రూ.10 వేల విలువైన వోచర్ల పంపిణీని ఇండిగో ప్రారంభించింది. ఇప్పటి వరకు టికెట్ డబ్బులు రీఫండ్ రాని వారికి త్వరలో అందిస్తామని పేర్కొంది.
Indigo Vouchers | ట్రావెల్ వోచర్లు
డిసెంబర్ మొదటి వారంలో వేలాది విమానాల రద్దు (Flight Cancelled)తో ప్రభావితమైన ప్రయాణికులకు ఇండిగో శుక్రవారం నుండి రూ.10 వేల విలువైన ట్రావెల్ వోచర్లను జారీ చేయడం ప్రారంభించింది. అదనంగా DGCA మార్గదర్శకాలకు అనుగుణంగా షెడ్యూల్ చేయబడిన బయలుదేరిన 24 గంటల్లోపు విమానాలు రద్దు చేయబడిన ప్రయాణికులకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పరిహారం అందిస్తోంది. విమానం బ్లాక్ సమయాన్ని బట్టి పరిహారం మారుతుంది. కాగా ఇండిగో ట్రావెల్ వోచర్లు 12 నెలల వరకు చెల్లుబాటులో ఉంటాయి. వీటిని ఏ ఇండిగో విమానం (Indigo Flight)లోనైనా ఉపయోగించవచ్చు.
రద్దు అయిన విమాన టికెట్లకు సంబంధించి రీఫండ్‌ను ఇప్పటికే ప్రాసెస్ చేయడం ప్రారంభించామని సంస్థ తెలిపింది. ఇప్పటికే చాలా మందికి డబ్బులు అందజేశామని పేర్కొంది. ఇంకా అందుకోని వారికి త్వరలో జమ చేస్తామని స్పష్టం చేసింది. ట్రావెల్ ఏజెంట్లు, భాగస్వామి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి సైతం రీఫండ్ డబ్బులు (Refund Money) అందించనున్నారు. కాగా ఇండిగో సంక్షోభంతో అనేక మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో కేంద్ర ప్రభుత్వం (Central Government) ఇండిగో శీతాకాల విమాన షెడ్యూల్‌ను 10శాతం తగ్గించింది. విమాన టిక్కెట్ల ధరలలో పెరుగుదలను అరికట్టడానికి ఛార్జీల పరిమితులను కూడా విధించింది.