అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Markets | భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం విషయంలో కొనసాగుతున్న అనిశ్చితితో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరికి నష్టాలతో ముగిశాయి. ఉదయం నిఫ్టీ(Nifty) 18 పాయింట్లు, సెన్సెక్స్ 119 పాయింట్ల లాభంతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ రోజంతా 82,219 నుంచి 82,751 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ 25,101 నుంచి 25,238 పాయింట్ల మధ్యలో కదలాడాయి. చివరికి సెన్సెక్స్(Sensex) 375 పాయింట్ల నష్టంతో 82,259 వద్ద, నిఫ్టీ 100 పాయింట్ల నష్టంతో 25,111 వద్ద స్థిరపడ్డాయి.
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,007 కంపెనీలు లాభపడగా 2,040 స్టాక్స్ నష్టపోయాయి. 152 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 149 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 40 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 5 కంపెనీలు అప్పర్ సర్క్యూట్(Upper circuit)ను, 10 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
వడ్డీరేట్ల కోత విషయంలో యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్(Trump), ఫెడ్ చైర్మన్ పొవెల్(Powell) మధ్య గంభీర వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పొవెల్‌ను మార్చాలని ట్రంప్ యోచిస్తున్నారు. ఈ పరిణామాలను విదేశీ పెట్టుబడిదారులు నిశితంగా గమనిస్తున్నారు. గ్లోబల్ మార్కెట్లు సైతం బలహీనంగా ట్రేడ్ అవుతుండడం మన మార్కెట్లపైనా ప్రభావం చూపింది. ఐటీ కంపెనీల క్యూ1 రిజల్ట్స్ నిరాశ పరచడంతో ప్రధాన సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. భారత్, యూఎస్‌ల మధ్య ట్రేడ్ డీల్(Trade deal) విషయంలో అనిశ్చితి కొనసాగుతుండడం, ముడి చమురు ధరలు పెరుగుతుండడం సైతం మన మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడికి కారణంగా భావిస్తున్నారు.
Stock Markets | సూచీల్లో ఒడిదుడుకులు..
ప్రధాన సూచీలను ఐటీ, బ్యాంక్ స్టాక్స్ వెనక్కి లాగాయి. బీఎస్‌ఈలో ఐటీ ఇండెక్స్(IT index) 1.47 శాతం నష్టపోగా.. పీఎస్‌యూ బ్యాంక్ 0.87 శాతం, బ్యాంకెక్స్ 0.51 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్ 0.42 శాతం, ఇన్‌ఫ్రా 0.41 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ 0.23 శాతం పడిపోయాయి. రియాలిటీ ఇండెక్స్(Realty index) 1.22 శాతం పెరగ్గా.. మెటల్ ఇండెక్స్ 0.62 శాతం, కమోడిటీ 0.42 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.32 శాతం, హెల్త్‌కేర్ 0.28 శాతం లాభపడ్డాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.30 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం లాభంతో ఉండగా.. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.35 శాతం నష్టపోయాయి.
Stock Markets | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 7 కంపెనీలు లాభాలతో 23 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. టాటా స్టీల్ 1.62 శాతం, ట్రెంట్ 0.68 శాతం, టైటాన్ 0.45 శాతం, టాటామోటార్స్ 0.41 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.30 శాతం లాభపడ్డాయి.
Stock Markets | Top losers..
టెక్‌మహీంద్రా 2.76 శాతం, ఇన్ఫోసిస్ 1.61 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 1.20 శాతం, ఎటర్నల్ 0.97 శాతం, ఎల్‌టీ 0.78 శాతం నష్టాలతో ఉన్నాయి.