అక్షరటుడే, న్యూఢిల్లీ: Indian Republic Day parade : గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో ఇచ్చేది కేవలం సైనిక ప్రదర్శన మాత్రమే కాదు.. ఇది భారత సార్వభౌమాధికారం, దేశ సాంస్కృతిక వైవిధ్యానికి నిదర్శనం. ఈసారి పరేడ్‌లో పాల్గొనే దళాలు, ప్రదర్శనలు ఏమిటో తెలుసుకుందాం..
Indian Republic Day parade : భారత సాయుధ బలగాలు..
భారత సాయుధ దళాలు పరేడ్‌కు వెన్నెముక లాంటివి. ఇందులో మూడు విభాగాలు ఉన్నాయి..
సైన్యం: వివిధ ఆర్మీ రెజిమెంట్లు (రాజ్‌పుత్ రెజిమెంట్, మద్రాస్ రెజిమెంట్, పారాచూట్ రెజిమెంట్) తమ ప్రత్యేకమైన యూనిఫామ్స్, మార్చింగ్తో ప్రదర్శన చేపడతాయి. ‘మెకనైజ్డ్ కాలమ్స్’లో భాగంగా దేశంలో తయారు చేసిన యుద్ధ ట్యాంకులు (అర్జున్), క్షిపణులు సైతం ప్రదర్శిస్తారు.
భారత నౌకాదళం: నేవీ కంటింజెంట్ తెల్లని యూనిఫామ్‌లో ప్రదర్శనలో పాల్గొంటుంది. బ్యాండ్ వాయిద్యాల మధ్య ఈ దళం కవాతు చేస్తుంది.
భారత వైమానిక దళం: వాయుసేన కవాతుతో పాటు, పరేడ్ చివరగా ‘ఫ్లై పాస్ట్’ (Fly-past) అత్యంత ముఖ్యమైనది. ఆకాశంలో యుద్ధ విమానాలు చేసే విన్యాసాలు హైలైట్.
Indian Republic Day parade : పారా మిలిటరీ, ఇతర దళాలు
కేంద్ర సాయుధ పోలీస్ దళాలు (CAPF): ఇందులో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), సీఐఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, ఐటీబీపీ దళాలు ఉంటాయి.
బీఎస్ఎఫ్ ఒంటెల దళం: ఇది ప్రపంచంలోనే ఒంటెలపై ప్రయాణించే ఒకే ఒక సైనిక దళం.
నేషనల్ క్యాడెట్ కోర్ (ఎన్సీసీ) & ఎన్ఎస్ఎస్: దేశంలోని ఆయా ప్రాంతాల నుంచి ఎంపికైన ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పరేడ్‌లో పాల్గొంటారు.
రాష్ట్రాలు, కేంద్రపాలిత శకటాలు (Tableaux)
ఏటా వివిధ రాష్ట్రాల నుంచి శకటాలను రక్షణ శాఖ ఎంపిక చేస్తుంది. ఇవి ఆయా రాష్ట్రాల చరిత్ర, సంస్కృతి, విజయాలను ప్రతిబింబిస్తాయి. ఇవి పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ)
భారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక ఆయుధ సంపత్తి (అగ్ని క్షిపణులు, రాడార్ వ్యవస్థలు)ని డీఆర్డీఓ ప్రదర్శనకు తీసుకొస్తుంది.
వీటితోపాటు దౌత్య సంబంధాల బలోపేతం కోసం.. ప్రతి సంవత్సరం ఒక స్నేహపూర్వక దేశ సైనిక దళం సైతం భారత దళాలతో కలిసి కవాతు చేస్తుంది.