అక్షరటుడే, వెబ్‌డెస్క్: Indian Couple Buys House Instead of Wedding | నేటి కాలంలో పెళ్లి అంటే కోట్లాది రూపాయల ఖర్చులు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ (Destination Weddings), భారీ ఫంక్షన్ హాల్స్ (Large function halls), అలంకరణలు అన్నీ కలిసి ఓ ఆడంబర వేడుకగా మారిపోయింది. ఒక్కరోజు కార్యక్రమం కోసం లక్షలు ఖర్చు చేయడం చాలా మందికి సాధారణంగా మారిపోయింది.
అయితే ఈ ట్రెండ్‌కు పూర్తి భిన్నంగా ఆలోచించిన ఓ భారతీయ యువజంట తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియా (Social Media)లో హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లి ఖర్చుల కోసం దాచిన డబ్బును వృథా చేయకుండా, అదే సొమ్ముతో సొంత ఇల్లు కొనుగోలు చేయడం ద్వారా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
Indian Couple Buys House Instead of Wedding | కొత్త ఇంట్లోనే వివాహం
ఈ జంట కేవలం ఇల్లు కొనడమే కాకుండా, తమ వివాహాన్ని కూడా అదే కొత్త ఇంట్లో జరుపుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆర్భాటాలు, అతిథుల గుంపులు, భారీ ఖర్చులు లేకుండా కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సాదాసీదాగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. “మా పెళ్లి ఖర్చు దాదాపు సున్నా… కానీ మాకు దక్కింది జీవితాంతం నిలిచే ఆస్తి” అని వారు గర్వంగా చెప్పిన మాటలు నెటిజన్ల మనసును హత్తుకుంటున్నాయి. వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఖాళీగా ఉన్న కొత్త ఇంట్లో సాధారణ దుస్తులతో, చిరునవ్వులతో ఒకరికి ఒకరు ప్రమాణాలు చేస్తూ కనిపించిన దృశ్యాలు నెటిజన్లను బాగా ఆకట్టుకున్నాయి. “వేలాది అతిథులు అవసరం లేదు… మన జీవితాన్ని గడిపే ఇంటి గోడలే సాక్షిగా ఉంటే చాలు” అనే సందేశాన్ని ఈ జంట తమ చర్య ద్వారా ఇచ్చినట్లయింది.
పెళ్లి పేరుతో అప్పులు చేసి, ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు పడే పరిస్థితుల కంటే, ముందుచూపుతో తీసుకున్న ఈ నిర్ణయం అనేకమందికి ఆదర్శంగా నిలుస్తోంది. భవిష్యత్ భద్రత కోసం పెట్టుబడి పెట్టడం ఎంత ముఖ్యమో ఈ ఉదాహరణ స్పష్టం చేస్తోందని ఆర్థిక నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. యువతలో మారుతున్న ఆలోచనా విధానానికి ఇది ఓ ప్రతీకగా నిలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈ వార్తపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. “అనవసర ఖర్చులను తగ్గించి నిజమైన స్థిరత్వాన్ని ఎంచుకున్నారు” అని కొందరు ప్రశంసిస్తుండగా, “ఇదే అసలైన వెడ్డింగ్ గోల్” అంటూ మరికొందరు అభినందనలు తెలుపుతున్నారు.