అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Asia Cup | దుబాయ్ (Dubai) వేదికగా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ గ్రాండ్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైటిల్ పోరులో ఆదివారం (సెప్టెంబర్ 28) భారత జట్టు, పాకిస్తాన్‌తో తలపడనుంది.
గురువారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్తాన్ (Pakistan) బంగ్లాదేశ్‌పై 11 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌటైంది. లోయర్ ఆర్డర్‌లో మహమ్మద్ హారిస్ (31), నవాజ్ (25) చేసిన పరుగులు జట్టును గౌరవప్రదమైన స్కోరుకు చేర్చాయి. బంగ్లాదేశ్ బౌలర్ తస్కిన్ అహ్మద్ 3 వికెట్లు తీసి చక్కగా రాణించాడు.
Asia Cup | ఫైనల్‌లో తొలిసారి..
అయితే, 136 పరుగుల స్వల్ప లక్ష్యం చేధనలో బంగ్లాదేశ్ తడబడి, 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులకే పరిమితమైంది. పాకిస్తాన్ బౌలర్లు షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ చెరో 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నారు. ఇక సూపర్-4లోనే అగ్రస్థానంలో నిలిచిన భారత జట్టు ఫైనల్‌కు ఇప్పటికే అర్హత సాధించింది. ఈ టోర్నమెంట్‌లో భారత్ (India), పాకిస్తాన్ రెండు సార్లు తలపడగా, ఆ రెండింటిలోనూ భారత్ విజయం సాధించింది. ఇప్పుడు ఆసియా కప్ టైటిల్ కోసం ఇరు జట్లు మూడోసారి తలపడుతున్నాయి. అద్భుత ఫామ్‌లో ఉన్న భారత్ వరుసగా గెలుపులతో దూసుకుపోతుండగా, పాకిస్తాన్ మాత్రం బ్యాటింగ్ వైఫల్యాలను అధిగమించి ఫైనల్‌లో సత్తా చాటాలని కసరత్తు చేస్తోంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరగబోయే ఈ మహా సంగ్రామంపై ప్రపంచ క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆసియా కప్ (Asia Cup) చరిత్రలో భారత్, పాకిస్థాన్ జట్లు టైటిల్ పోరులో పోటీపడడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సిరీస్‌లో భారత్‌తో రెండు మ్యాచ్‌లు ఆడిన పాక్ రెండింట్లో ఓటమి పాలైంది. మరి ఫైనల్‌లో ఏమైనా అద్భుతాలు చేస్తుందా అనేది చూడాలి.. ఇక ఈ రోజు సూపర్ 4లో చివరి మ్యాచ్ జరగనుండగా, ఈ మ్యాచ్‌లో భారత్-శ్రీలంక పోటీ పడబోతున్నాయి. ఇది నామమాత్రపు మ్యాచ్ అయినా ప్రాక్టీస్ కోసం భారత జట్టు ప్రత్యేక దృష్టి పెట్టనుంది.