అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ (Qutubullahpur) మండలం పేట్‌బషీరాబాద్‌లో జర్నలిస్టులకు కేటాయించిన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. సర్వే నంబరు 25/2 లోని 38 ఎకరాల భూమి చుట్టూ బుధవారం ఫెన్సింగ్ వేసింది.
ఈ భూమిని జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచ్యువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (JNJMACHS)కి రాష్ట్ర ప్రభుత్వం 2008లో కేటాయించింది. ఈ భూమిని జర్నలిస్టులకు కేటాయిస్తూ హెచ్ ఎండీఏ కస్టడీలో ప్రభుత్వం ఉంచిన విషయం విధితమే. అయితే ఈ కేటాయింపులపై కొంతమంది కోర్టుకెళ్లడంతో అక్కడ జర్నలిస్టులకు ప్లాట్ల పంపిణీ జరగలేదు. కోర్టులో వివాదం ఉంటుండగానే.. మరోవైపు అక్కడ ఆక్రమణలు జరుగుతున్నాయని హైడ్రాకు సొసైటీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై రెవెన్యూ, హెచ్ఎండీఏ అధికారులు కూడా ఫిర్యాదు చేశారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydraa Commissioner Ranganath) ఆదేశాల మేరకు రెవెన్యూ, మున్సిపల్, హెచ్ఎండీఏ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టారు. ఆక్రమణలు జరిగినట్టు గుర్తించారు. ఇప్పటికే కొంతమంది ఇళ్లు కట్టుకుని ఉండగా.. వాటి జోలికి వెళ్లకుండా ఖాళీగా ఉన్న భూమి చుట్టూ ఫెన్సింగ్ వేశరు. ఈ విషయమై కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. కోర్టు తీర్పు ప్రకారం ఆ స్థలం కేటాయింపులు జరుగుతాయని, ఈ లోగా ఆక్రమణలు జరగకుండా ప్రభుత్వ భూమిని కాపాడుతున్నట్టు హైడ్రా స్పష్టం చేసింది. అలాగే అక్కడ ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారితో త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో రికార్డులను పరిశీలిస్తామని హైడ్రా కమిషనర్ చెప్పారు.
