అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఘటకేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ, డాక్టర్స్ కాలనీలో నాలుగు వేల గజాల పార్కు స్థలాన్ని హైడ్రా (Hydraa) కాపాడింది. దీని విలువ రూ. 30 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
డాక్టర్స్ కాలనీ (Doctors Colony)లో 1985లో 26.9 ఎకరాల పరిధిలో 500 ప్లాట్లతో లే అవుట్ వేశారు. ఆ సమయంలో పార్క్ కోసం నాలుగు వేల గజాల స్థలాన్ని విడిచిపెట్టారు. అనంతరం ఆ స్థలాన్ని భూ యజమానులే ఆక్రమించారు. ఈ విషయమై చౌదరిగూడలోని డాక్టర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydraa Commissioner Ranganath) గారి ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదును హైడ్రా అధికారులు సంబంధిత శాఖలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Hydraa | తప్పుడు పత్రాలతో..
లే అవుట్ (Layout) వేసినప్పుడు 4 వేల గజాల స్థలాన్ని పార్కుగా చూపించారు. లే అవుట్ వేసిన వారి కుటుంబ సభ్యుల్లో ఆముదాల నరసింహ కొడుకు ఆముదాల రమేష్ తప్పుడు డాక్యుమెంట్స్‌తో ఆ స్థలాన్ని 5 ప్లాట్లుగా కులకర్ణి అనే వ్యక్తికి అమ్మేశాడు. కులకర్ణి అనే వ్యక్తి వాటిని 200 గజాల చొప్పున 20 ప్లాట్లుగా చేసి రాజేష్, సోమాని తో పాటు పలువురికి విక్రయించాడు. ఈ విషయమై కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. తాజాగా హైడ్రా ప్రజావాణి (Prajavani)లో ఫిర్యాదు చేయగా.. సమస్యకు పరిష్కారం లభించింది.విచారణ పూర్తి చేసి.. పార్కు స్థలంగా నిర్ధారించుకున్న హైడ్రా అధికారులు శుక్రవారం ఆక్రమణలు తొలగించారు. 4 వేల గజాల పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో స్థానికులు హైడ్రాకు ధన్యవాదాలు తెలిపారు.

