అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Lakes Development | హైదరాబాద్ (Hyderabad) నగరంలో చెరువుల అభివృద్ధిని వేగవంతం చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Commissioner Ranganath) ఆదేశించారు. చెరువులలో మురుగు నీటిని తొలగించాలని సూచించారు.
రామచంద్రాపురంలోని గంగారం చెరువుతో పాటు, ఈర్ల చెరువును హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం పరిశీలించారు. నగరంలోని పలు చెరువులను హైడ్రా పునరుద్ధరించింది. బతుకమ్మ కుంట, కూకట్పల్లి నల్లచెరువు (Nalla Cheruvu), పాతబస్తీ చెరువును అభివృద్ధి చేసింది. రెండో విడతలో మరో 14 చెరువులను పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. అందులో గంగారం, ఈర్ల చెరువులు సైతం ఉన్నాయి. వరద కాలువ ద్వారానే కాకుండా.. నేరుగా మురుగు వివిధ ప్రాంతాల్లో చెరువులోకి ప్రవేశించడం, గుర్రపు డెక్కతో చెరువులు దుర్గంధభరితంగా మారడానికి గల కారణాలను కమిషనర్ పరిశీలించారు. చెరువుల్లోకి నేరుగా మురుగు నీరు చేరకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.
Hyderabad Lakes Development | ఎఫ్‌టీఎల్ తగ్గొద్దు
గంగారం చెరువు 111 ఎకరాల మేర విస్తరించి ఉంది. అలాగే ఈర్ల చెరువు 32 ఎకరాల వరకూ ఉంది. ఈ చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధి ఎట్టి పరిస్థతుల్లోనూ తగ్గవద్దని రంగనాథ్ ఆదేశించారు. బఫర్ జోన్‌తో పాటు.. చెరువుల వద్ద ఉన్న ప్రభుత్వ భూమిని కూడా కాపాడాలన్నారు. పార్కులు, పిల్లల ప్లే ఏరియాలు, అన్ని వయసులవారు సేద దీరేలా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. చెరువుల్లోకి మురుగు నీరు నేరుగా చేరకుండా ఎస్‌టీపీలు ఏర్పాటుకు, మురుగు నీరు సెడిమెంటేషన్ పాండ్ నిర్మాణానికి అవసరమైన స్థలం ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్లపాపయ్య, అధికారులు పాల్గొన్నారు.
