అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa | హైడ్రా అధికారులు నగరంలోని రెండు పార్కులను కాపాడారు. శనివారం 3,712 గజాల పార్కు స్థలాలను కాపాడి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
రంగారెడ్డి (Rangareddy) జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలో రెండు పార్కులను హైడ్రా కాపాడింది. పద్మశ్రీ హిల్స్ కాలనీలోని 2,600 గజాల పార్కు స్థలాన్ని రక్షించింది. 1983లో 10 ఎకరాల విస్తీర్ణంలో 230 ప్లాట్లతో లే ఔట్ వేయగా.. ఇందులో 2,600 గజాల స్థలాన్ని పార్కుకోసం కేటాయించారు. బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ అధికారులు ఈ పార్కు చుట్టూ ప్రహరీ నిర్మించి అభివృద్ధి చేయడానికి ప్రయత్నించగా.. పక్కనే ల్యాండ్ ఉన్న వారు ఈ స్థలం తనదంటూ అడ్డుకోవడంతో ఆ పనులు ఆగిపోయాయి. పద్మశ్రీనగర్ కాలనీ నివాసితులు హైడ్రాకు ఇదే విషయాన్ని ఫిర్యాదు చేయగా.. స్థానిక రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించి పార్కుకు కేటాయించిన స్థలంగా హైడ్రా నిర్ధారించుకుంది. శనివారం పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది.
Hydraa | పీఎన్‌టీ కాలనీలో..
పద్మశ్రీ హిల్స్‌కు ఆనుకుని ఉన్న పీఎన్‌టీ కాలనీ డి బ్లాక్‌లో మరో 1,112 గజాల పార్కు స్థలానికి కబ్జాల చెర నుంచి హైడ్రా విముక్తి కల్పించింది. ఇలా మొత్తం 3712 గజాల పార్కు స్థలాలను కాపాడి హైడ్రా సిబ్బంది చుట్టూ ఫెన్సింగ్ వేశారు. శుక్రవారం సైతం నగరంలో భారీ మొత్తంలో ఆక్రమణలను హైడ్రా తొలగించిన విషయం తెలిసిందే. నాలుగు ప్రాంతాల్లో 12.50 ఎకరాల మేర ప్రభుత్వ భూమిని కాపాడింది. దీని విలువ రూ. 1,100 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 10లో మొత్తం 5 ఎకరాల మేర ఉన్న కబ్జాలను హైడ్రా తొలగించింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 7.50 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోగా..రంగారెడ్డిజిల్లాలో ప్రజావసరాలకు ఉద్దేశించిన 680 గజాల స్థలాన్ని హైడ్రా కాపాడింది.