అక్షరటుడే, హైదరాబాద్: Hydra public grievance cell | వెంచర్లు వేసేటప్పుడు పార్కులుగా స్థలాలను చూపించారు. ఆ తర్వాత వాటిని ప్లాట్లుగా మార్చేసి లే ఔట్ వేసిన వారు విక్రయించుకున్నారంటూ హైడ్రా ప్రజావాణిలో పలువురు ఫిర్యాదు చేశారు. గ్రామపంచాయతీ లే ఔట్, హుడా లే ఔట్ అనే తేడా లేకుండా అన్ని చోట్లా ఇదే దుస్థితి నెలకొందని వాపోయారు.
పార్కులుగా చూపుతూ గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు గిఫ్ట్ డీడ్లు రాసిచ్చిన తర్వాత సైతం పార్కు స్థలాలను ప్లాట్లుగా మార్చేసినట్లు ఫిర్యాదుదారులు ఆరోపించారు. ప్రభుత్వ స్థలాలు, రహదారులను సైతం కబ్జాలు చేస్తున్నారని పేర్కొన్నారు. హైడ్రా ప్రజావాణికి సోమవారం 65 ఫిర్యాదులు వచ్చాయి. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వాటిని పరిశీలించి.. ఫిర్యాదుదారుల ఎదుటే సంబంధిత అధికారులతో మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేశారు.
Hydra public grievance cell | విన్నపాలు..
గతంలో 7 కాలనీలకు మార్గం చూపుతూ ఆక్రమణలను, అక్రమ ప్రహరీలను హైడ్రా కూలగొట్టినా ఫలితం లేకుండాపోయిందని తుర్కయాంజల్ మున్సిపాలిటీ 24వ వార్డు ప్రజలు ఫిర్యాదు చేశారు. ఆ ప్రాంతంలో రోడ్డు వేయడానికి ఆక్రమణదారులు అడ్డు పడుతున్నారన్నారు. స్థానిక అధికారులు పట్టించుకోవడం లేదని, హైడ్రా స్పందించాలని కోరారు.
రంగారెడ్డి జిల్లా భాగ్ హయత్‌నగర్ శ్రీ రాంనగర్ కాలనీలోని ఉన్న సర్వే నంబరు 97లో ఉన్న 300 గజాల రెండు పార్కులు కబ్జాకు గురవుతున్నాయని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. సదరు కాలనీలో నాలుగు చోట్ల కబ్జాలు జరుగుతున్నాయని.. పార్కులను వెంటనే కాపాడాలని హైడ్రా కమిషనర్‌ను కోరారు. దీనికితోడు సరూర్‌నగర్ మండలం, చంపాపేట్ విలేజ్‌లోని దుర్గాభవానీ నగర్లో ఉన్న 361 గజాల ఉద్యానం ఇంటి ప్లాటుగా మారిపోయిందన్నారు.
Hydra public grievance cell | ఆక్రమణలు మామూలుగా లేవు..
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా, కుత్బుల్లాపూర్ మండలం, సుభాష్ నగర్ పరిధి భాగ్యలక్ష్మి కాలనీలో ఉద్యానం, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని స్థానిక కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. మొత్తం 6 పార్కులు, ఓపెన్ స్థలాలు ఆక్రమణలకు గురవుతున్నాయన్నారు. గతంలో GHMC ప్రహరీ నిర్మాణానికి వర్క్ ఆర్డర్ ఇచ్చినప్పటికీ, రాజకీయ జోక్యంతో పనులు నిలిచిపోయాయని స్థానికులు వాపోయారు.
మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగిపేట సర్కిల్ ఆల్మాస్‌గూడ 57వ డివిజన్ శ్రీ హిల్స్ కాలనీ ఫేజ్ 2లో 1983లో 460 ప్లాట్లతో వెంచర్ వేశారు. కాగా, ఇందులో 2260 గజాలను పార్కుకు కేటాయించారు. అయితే, ఈ ఉద్యాన స్థలంలో ఇప్పటికే ఆరు ఇళ్లు నిర్మించారని, మిగతా స్థలాన్నైనా అయినా కాపాడాలని కోరారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పరిధి అల్వాల్ మండలం మచ్చబొల్లారంలోని విజయవిహార్ ఎన్క్లేవ్ వెంచర్లో రోడ్లతోపాటు పాటు.. వరద కాలువను నిర్మించేందుకు 20 అడుగుల ఖాళీ స్థలాన్ని వదిలేస్తే.. సమీపంలోని భూ యజమానులు ఆ 20 అడుగుల దారిని కబ్జా చేసేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం పరిధి మచ్చబొల్లారంలో 432 ప్లాట్లతో శ్రీ సాయి రెడ్డీ వెంచర్ (లే అవుట్) వేసిన విషయాన్ని స్థానికులు గుర్తుచేశారు. ఈ లే ఔట్‌కు సమీపంలోనే మూత్కుల్ అనే కుంట ఉంది. కాగా, దీని అలుగు మీద అక్రమ కట్టడాలు నిర్మించడంతో చెరువులోని నీరు బయటకు ప్రవహించేందుకు వీలు లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ లే అవుట్లో 90 ప్లాట్ల వరకు నీటిలో మునిగినట్లు తెలిపారు. ఈ చెరువు గతంలో 5.22 ఎకరాలుగా ఉండేదని, మురుగు చేరడం, ఆక్రమణలు పెరగడం వల్ల నీటి నిల్వలు పెరుగుతున్నాయని వాపోయారు.
రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ గందంగూడ పరిధి గ్రీన్ పార్క్స్ కాలనీలో హైదర్షాకోట్ – బైరాగి గూడ ప్రధాన రహదారి 30 అడుగులు ఉండేదని, సమీపంలోనివారు 12 అడుగులకు పైగా ఆక్రమించేయడంతో ఆ రహదారి రూపురేఖలు కోల్పోయిందని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు.
మణికొండ సచివాలయ ఉద్యోగుల కాలనీలో పార్కులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురయ్యాయని వైఎస్ ఆర్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ కాలనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. 2236, 1163 గజాల స్థలాలను కబ్జాలకు గురికాకుండా కాపాడాలని విన్నవించారు.