అక్షరటుడే, వెబ్‌డెస్క్: CP Sajjanar | దేశంలో రోజు రోజుకు సైబర్ నేరాలు (Cybercrimes) పెరుగుతున్నాయి. వీటిపై ఫిర్యాదు చేయడానికి హైదరాబాద్ పోలీసలు (Hyderabad Police) సి–మిత్ర విభాగాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీని సాయంతో ఎక్కడి నుంచైనా బాధితులు సులువుగా ఫిర్యాదు చేయవచ్చు.
‘సి-మిత్ర’ (C-Mitra) అనేది వర్చువల్ హెల్ప్ డెస్క్. ప్రజలు పోలీస్ స్టేషన్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండా, వారి ఇళ్ల నుంచే సైబర్ క్రైమ్ FIRలు నమోదు చేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. సైబర్ క్రైమ్ రిపోర్టింగ్‌ను సులభతరం, వేగవంతం చేయడం కోసం దీనిని ఏర్పాటు చేశారు. పెరుగుతున్న డిజిటల్ మోసాల (digital fraud) ముప్పును ఎదుర్కోవడం దీని లక్ష్యం. దీనిని హైదరాబాద్ సీపీ సజ్జనార్ శుక్రవారం ప్రారంభించారు. సి-మిత్ర ద్వారా బాధితులు తమ ఫిర్యాదులను చట్టబద్ధంగా కట్టుబడి ఉన్న FIRలుగా మార్చడంలో ఎండ్-టు-ఎండ్ సహాయం పొందుతారని ఆయన తెలిపారు.
CP Sajjanar | స్టేషన్‌కు వెళ్లడం లేదు
నిత్యం ఎంతో మంది సైబర్ నేరాల బారిన పడుతున్నారు. అయితే వీరు 1930 హెల్ప్‌లైన్, నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. కానీ ఎఫ్ఐఆర్ నమోదు కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం లేదు. దీంతో సైబర్ క్రైమ్ కేసుల్లో 18శాతం మాత్రమే ఎఫ్ఐఆర్లు నమోదు అవుతున్నాయి. తాజాగా సి–మిత్రను నగర పోలీసులు ప్రారంభించారు. కొత్త విధానం ద్వారా బాధితులు తమ ఫిర్యాదును పోస్ట్, లేదా పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ ద్వారా పంపవచ్చు. సి మిత్రా సెల్‌కు ఫోన్ చేస్తే ఫిర్యాదు ఎలా చేయాలో అవగాహన కల్పిస్తారు.