అక్షరటుడే, వెబ్‌డెస్క్: Divorce celebration : విడాకులంటే చాలా మంది భయపడతారు. అదో పీడ కలగా భావిస్తారు.
కానీ.. అతడు మాత్రం అదో స్వాతంత్ర్యంగా భావిస్తున్నాడు. సంబరం చేసుకుంటున్నాడు. తాళి కట్టిన నాటి నుంచి ఎంత టార్చర్ అనుభవించాడో.. ఎంత ఓపికతో ఆక్రోషాన్ని, ఆవేశాన్ని అనుచుకున్నాడో తెలీదు. కానీ, విడాకులు లభించిన వెంటనే సంతోషంతో ఆగలేకపోయాడు. ఏకంగా నాలుగు బకెట్ల పాలతో స్నానం చేసేశాడు. ఇతగాడి సంబరం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
Divorce celebration : ఈ రోజు నుంచి నేను ఫ్రీ..
అసోం Assam రాష్ట్రానికి చెందిన మాలిక్ భార్య బాధితుడిగా పేర్కొంటున్నారు. ఇతగాడు విడాకుల కోసం నెలల తరబడి ఎదురుచూస్తూ వచ్చాడు. ఎట్టకేలకు అతడి భార్యతో డైవర్స్ మంజూరు అయింది. దీంతో ఆనందం ఆపుకోలేకపోయాడు. తనకు తానే పాలాభిషేకం చేసుకున్నాడు. ఏకంగా నాలుగ బకెట్ల పాలతో ఇలా చేసి కొత్త ట్రెండ్ సెట్ చేశాడు.
ఇంటి బయట.. నాలుగు బకెట్ల నిండా పాలు నింపుకుని.. ఒకదాని తర్వాత ఒకటి గుమ్మరించుకుంటూ అత్యంత ఉల్లాసంగా స్నానం చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. పాలతో స్నానం చేయడాన్ని కెమెరాలో రికార్డ్ చేశాడు. “ఈ రోజు నుంచి నేను ఫ్రీ” అంటూ కేరింతలు పెట్టడంపై నెటిజన్లు ఫుల్ కామెంట్స్ చేస్తున్నారు.
Divorce celebration : ఎందుకంత సంతోషం అంటే..
మాలిక్ భార్యకు ఓ లవర్ ఉన్నాడు. సదరు లవర్తో ఈమె రెండుసార్లు పారిపోయిందట. ఈ విషయాన్ని అతగాడే స్వయంగా చెప్పుకొచ్చాడు. ఆమె వెకిలి చేష్టలతో ఎంతో విసిగిపోయానని మాలిక్ తెలిపాడు. తనతో పాటు తన ఫ్యామిలీ కూడా ఈ విషయంలో ఎంతో ఓపిక పట్టిందన్నాడు.
అయినా, ఆమె ఆగడాలకు హద్దు లేకుండా పోయిందని వాపోయాడు. ఈ నేపథ్యంలోనే విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయినట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్లు మాలిక్ తెలిపాడు.
కోర్టులో విడాకులు తుదిదశకు చేరుకున్నట్లు న్యాయవాది చెప్పడంతో సెలబ్రేట్ చేసుకున్నట్లు మాలిక్ తెలిపాడు. తాను పాలతో స్నానం చేస్తున్నట్లు, తనకు తానే పాలాభిషేకం చేసుకుంటున్నట్లు సంబరంతో చెప్పుకొచ్చాడు. “నాకు స్వేచ్ఛ లభించింది.. స్వాతంత్ర్యం వచ్చిందంటూ ఆనందం వ్యక్తం చేశాడు. కాగా, ఇతగాడి సంబరం ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది.