అక్షరటుడే, వెబ్‌డెస్క్ : GST Reforms | కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన జీఎస్టీ సంస్కరణలతో కొనుగోళ్లు భారీగా పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తెలిపారు. జీఎస్టీ రేటు కోతలతో కలిగే పన్ను ప్రయోజనాలను సామాన్యులకు అందించామని చెప్పారు.
కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, అశ్విని వైష్ణవ్‌తో ఆమె విలేకరులతో మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపుతో వాహనాలు, ఎలక్ట్రానిక్స్ అమ్మకాలు (Electronics Sales) బాగా జరిగాయని ఆమె తెలిపారు. ప్రభుత్వం రోజువారీ వినియోగ వస్తువులను పరిశీలిస్తోందన్నారు. ప్రతిదానిలోనూ జీఎస్టీ సంస్కరణలతో (GST Reforms) కలిగే పన్ను ప్రయోజనం వినియోగదారులకు చేరినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ పన్ను తగ్గించామని ఆమె అన్నారు. దీంతో వినియోగదారులు ఎక్కువ ప్రయోజనాలను పొందుతున్నట్లు వెల్లడించారు.
GST Reforms | వాహనాల అమ్మకాల్లో పెరుగుదల
జీఎస్టీ 2.0 అమలు తర్వాత వాహనాలు, ఏసీలు, టీవీల అమ్మకాలు పెరిగాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. త్రీ వీలర్ వాహనాల డిస్పాచ్‌లు 5.5 శాతం పెరిగాయని, ద్విచక్ర వాహనాల అమ్మకాలు 21.6 లక్షల యూనిట్లకు చేరుకున్నాయని తెలిపారు. సెప్టెంబర్ 22న GST సంస్కరణలు ప్రారంభమైన మొదటి రోజే ఏసీ అమ్మకాలు రెట్టింపు అయ్యాయని, టీవీ అమ్మకాలు 30-35 శాతం పెరిగాయని ఆమె వివరించారు.
GST Reforms | అతిపెద్ద సంస్కరణ
కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ.. నవరాత్రి సందర్భంగా వాహన అమ్మకాలు పెరిగాయన్నారు. మొదటి ఎనిమిది రోజుల్లో మారుతి సుజుకి (Maruti Suzuki) 1.65 లక్షల కార్లను విక్రయించిందని పేర్కొన్నారు. GST 2.0ను ఆయన అతిపెద్ద సంస్కరణగా అభివర్ణించారు. ప్రస్తుతం భారతదేశ వృద్ధి వేగం చాలా బలంగా ఉందన్నారు. ఐఎంఎఫ్ కూడా వృద్ధి అంచనాను 6.6 శాతానికి సవరించినట్లు తెలిపారు. ఈ సంవత్సరం రూ. 20 లక్షల కోట్ల విలువైన అదనపు ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం ఉంటుందని ఐటీ మంత్రి వైష్ణవ్ అంచనా వేశారు.