అక్షరటుడే, వెబ్‌డెస్క్: Homemade protein powder | పిల్లల శారీరక ఎదుగుదలకు, మెదడు చురుగ్గా పనిచేయడానికి డ్రై ఫ్రూట్స్ ఎంతో అవసరం. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి పిల్లలను సీజనల్ వ్యాధుల నుంచి కాపాడతాయి. అయితే చాలా మంది పిల్లలు బాదం, వాల్నట్స్ వంటివి నేరుగా తినడానికి మారాం చేస్తుంటారు. మరికొందరు పాలు తాగడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటి పిల్లల కోసం డ్రై ఫ్రూట్స్‌తో ఇంట్లోనే అద్భుతమైన ప్రోటీన్ పౌడర్‌ను తయారు చేయవచ్చు. దీన్ని పాలల్లో కలిపి ఇస్తే పిల్లలు ఇష్టంగా తాగడమే కాకుండా వారికి సంపూర్ణ ఆరోగ్యం అందుతుంది. ఈ హెల్తీ పౌడర్ తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.
Homemade protein powder | కావాల్సిన పదార్థాలు:
- బాదం పప్పు Almonds – ఒక కప్పు
- జీడిపప్పు Cashew nuts – అర కప్పు
- పిస్తాపప్పు Pistachios – అర కప్పు
- వాల్ నట్స్ Walnuts – అర కప్పు
- యాలకులు Cardamoms – 4 నుండి 5
- కుంకుమ పువ్వు Saffron – చిటికెడు
Homemade protein powder | తయారీ విధానం:
ముందుగా తీసుకున్న బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్నట్స్ తేమ లేకుండా పొడిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి, వీటన్నింటినీ నూనె లేకుండా దోరగా వేయించాలి. వేయించిన పప్పులను ఒక ప్లేట్లోకి తీసుకుని కనీసం 10 నిమిషాల పాటు పూర్తిగా చల్లారనివ్వాలి.
పౌడర్ చేయడం: చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చివరగా యాలకులు, కుంకుమ పువ్వు కూడా కలిపి మరోసారి గ్రైండ్ చేస్తే సువాసనతో కూడిన డ్రై ఫ్రూట్ పౌడర్ సిద్ధమవుతుంది. ఈ పొడిని గాలి దూరని సీసాలో భద్రపరుచుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
ఉపయోగించే విధానం: ఒక గ్లాసు వేడి పాలల్లో ఒకటి లేదా రెండు టీస్పూన్ల పౌడర్‌ను వేసి బాగా కలపాలి. దీనివల్ల పాలకు మంచి రుచి, రంగు వస్తాయి. ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు ఈ పాలు పిల్లలకు ఇవ్వడం చాలా మంచిది.
కలిగే ప్రయోజనాలు: ఇది పిల్లల్లో ఇమ్యూనిటీని పెంచి, ముఖ్యంగా చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి రక్షిస్తుంది. ఇందులో ఉండే వాల్నట్స్, బాదం మెదడు అభివృద్ధికి తోడ్పడి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఈ పౌడర్ కలిపిన పాలు తాగడం వల్ల పిల్లల్లో జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గి, ఆకలి మెరుగుపడుతుంది.