అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hydraa Commissioner | హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన ప్రత్యక్షంగా కోర్టులో హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. బతుకమ్మ కుంట (Bathukamma Kunta) కేసులో ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ధిక్కార కేసులో డిసెంబర్ 5న రంగనాథ్ (Hydraa Commissioner Ranganath) స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. లేకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది. బతుకమ్మ కుంట రక్షణ, పునరుద్ధరణకు సంబంధించిన గతంలో జారీ చేసిన ఆదేశాలను పాటించకపోవడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. షెడ్యూల్ చేసిన తేదీన కమిషనర్ తన వివరణను బెంచ్ ముందు వ్యక్తిగతంగా సమర్పించాలని ఆదేశించింది.
Hydraa Commissioner | సున్నం చెరువు విషయంలో..
మాదాపూర్ (Madhapur)లోని సున్నం చెరువు విషయంలో సైతం హైడ్రా తీరుపై బుధవారం హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించిందంటూ మండిపడింది. సున్నం చెరువు కూల్చివేతల విషయంలో హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోర్టు (High Court) ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ ఫెన్సింగ్ ఎందుకేశారని ప్రశ్నించింది. ఎఫ్టీఎల్ పరిధి నిర్ధారించకుండా కూల్చివేతలు ఎలా చేపడుతారని ప్రశ్నించింది. హద్దుల కోసం సర్వే ఎందుకు చేపట్టలేదని పేర్కొంది. సున్నం చెరువు సియేట్ కాలనీలో ఉన్న వారిపై హైడ్రా చర్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 300-A ప్రకారం హక్కుల ఉల్లంఘనకు దారి తీస్తాయని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.