అక్షరటుడే, వెబ్డెస్క్: Hydraa | ప్రతి ఒక్కరు కష్టకాలంలో ఇతరులకు సాయం చేయాలని హైడ్రా కమిషనర్ రంగానాథ్ (Hydra Commissioner Ranganath) సూచించారు. ముఖ్యంగా ప్రకృతి విపత్తుల సమయంలో పక్కన ఉన్నవారిని కాపాడే ప్రయత్నం చేయాలని సూచించారు.
‘నేను.. నా వాళ్లతో పాటు.. చుట్టు పక్కల ఉన్న వాళ్ల గురించి ఆలోచించినప్పుడే మన జీవితానికి సార్థకత ఉంటుందని హైడ్రా కమిషనర్ అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తనతో పాటు చుట్టుపక్కల వారిని కూడా సురక్షితంగా కాపాడాలనే ఉద్దేశంతో యువ ఆపద మిత్ర పథకం (Yuva Apada Mitra) తీసుకు వచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వలంటీర్లకు హైడ్రా (Hydra) ఆధ్వర్యంలో ఫతుల్గూడలో ఏర్పాటు చేసిన శిక్షణను బుధవారం ఆయన ప్రారంభించారు. ఇతరుల కోసం పాటుపడే ఆలోచనతో ఈ శిక్షణకు రావడం ఎంతో ఆనందించదగ్గ విషయమన్నారు. మన రెండు చేతుల్లో ఒకటి పరులకు చేయూతనందించడానికి ఉపయోగపడాలన్నారు.
Hydraa | చేయూత అందించాలి
జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడం వరకే పరిమితమవ్వకుండా ఇతరులకు కూడా చేయూత అందించాలని రంగనాథ్ సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తోటివారిని కాపాడడం ఎలా అనేది ఈ శిక్షణలో నేర్పుతారని చెప్పారు. వలంటీర్లకు కూడా చుట్టుపక్కల ఉన్న పరిస్థితులపై అవగాహన ఉండాలన్నారు. వారం రోజుల్లో మెలకువలు నేర్చుకోవాలని సూచించారు. హైడ్రా అడ్మిన్ సుదర్శన్, అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ దామోదర్ సింగ్ తదితరులు తెలిపారు.