అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gulf Workers | పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికులు గుండెపోటుతో మృతి చెందుతున్నారు. ఇక్కడ ఉపాధి లేక బతుకు దెరువు కోసం వెళ్లి అక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు.
కామారెడ్డి(Kamareddy) జిల్లాలోని సోమారంపేట తండాకు చెందిన గుగులోత్ రవి సెప్టెంబర్ 6న దుబాయిలో గుండెపోటుతో చనిపోయాడు. చుక్కాపూర్(Chukkapur)కు చెందిన కామటి ఎల్లయ్య సెప్టెంబర్ 12న హార్ట్ ఎటాక్‌తో మరణించారు. గల్ఫ్ మరణాలపై కామారెడ్డికి చెందిన కవి డి.శ్రీరామ్ కవిత రూపంలో వారి ఆవేదనను వ్యక్తం చేశారు.
ఉన్న ఊరిలో ఉపాధి లేక
భార్యా పిల్లలను వదిలి
పొట్ట చేత పట్టుకొని
దేశం కాని దేశం వెళ్ళిన బిడ్డలకు ఎంత కష్టం ఎంత నష్టం
భాష రాని ఎడారి దేశంలో బానిసలా పడి ఉన్న దైన్యం
క్షణం క్షణం భయం భయం
కోటి ఆశలతో వెళ్లిన కొద్ది రోజులకే జైలు పాలైన వారి గోస వర్ణనాతీతం
అప్పుల బాధలు ఒక వైపు
ఆకలి కేకలు మరో వైపు
ఇంటి కాడ ముసలి తల్లిదండ్రులు భార్యా, పిల్లలు ఎలా ఉన్నారో ఏం తిన్నారోననే ఆవేదన ఇంకొక వైపు
ఏదో ఒకలా జైలు నుంచి బయట పడ్డ ఆనందం
భార్యా పిల్లలకు ఏం చెప్పాలనే బాధతో తన్నుకు వస్తుంది
దుఃఖం
అప్పటికే ముంచుకొస్తుంది వీసా సమయం
ఏం చేయాలో ఎటు పోవాలో తెలియని అయోమయం
ఆందోళనతో ఆగుతున్న కార్మికుల గుండె
నాలుగు రాళ్లు సంపాదిస్తాడని ఎడారి దేశం వెళ్లిన సగటు మనిషి శవ పేటిక రూపంలో ఇల్లు చేరడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించే దైన్యం
స్వాతంత్ర్య భారతంలో సగటు జీవికి ఎంత కష్టం ఎంత నష్టం