అక్షరటుడే, వెబ్‌డెస్క్: Uttar Pradesh | వరకట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్న నేటి కాలంలోనూ ఓ యువకుడు విశాల హృదయం చాటుకున్నాడు. పెళ్లి సందర్భంగా అత్తామామలు ఇచ్చిన రూ.31 లక్షల కట్నం తిరిగి వారికే ఇచ్చేశాడు. వరుడి సూచన మేరకు రూ. ఒక రూపాయి, ఒక కొబ్బరి కాయతో మొత్తం పెళ్లి క్రతువును పూర్తి చేశారు. ఈ ఆదర్శ వివాహం హరియాణాలోని కురుక్షేత్రలో జరిగింది.
ఉత్తర్ ప్రదేశ్‌లోని సహరాన్‌పూర్ జిల్లా భాబ్సి రాయ్‌పూర్‌కు చెందిన శ్రీపాల్ రాణా కుమారుడు వికాస్ రాణా న్యాయవాది. అభ్యుదయ భావాలు కలిగిన యువకుడు. తండ్రి శ్రీపాల్ బీఎస్పీ తరఫున యూపీలోని కైరానా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు.
కాగా, వికాస్ రాణాకు హరియాణాలోని లుక్ఖి గ్రామానికి చెందిన అగ్రికా తన్వర్‌తో వివాహం కుదిరింది. పెళ్లి రోజు(ఏప్రిల్ 30) వికాస్ రాణా కుటుంబం ఊరేగింపుగా హరియాణాలోని కురుక్షేత్రకు చేరుకుంది. నగరంలోని ఓ హోటల్‌లో వివాహ వేడుకకు ఏర్పాట్లు చేశారు.
తిలకం వేడుక జరుగుతున్న సమయంలో వధువు తల్లిదండ్రులు, పెళ్లికొడుకుకు వరకట్నంగా రూ.31 లక్షల నగదు ముట్టజెప్పారు. కానీ, వరుడు వికాస్ ఆ డబ్బు తీసుకోలేదు. వరకట్నం ఇవ్వడం, తీసుకోవడం సామాజిక దురాచారం అంటూ నిరాకరించాడు. తమకు వధువే ఒక కట్నం అంటూ వికాస్ రాణా చెప్పుకొచ్చారు.
అలా అతని కోరిక మేరకు వికాస్ రాణా, అగ్రికా తన్వర్‌ల పెళ్లి తంతును ఒక రూపాయి నాణెం, ఒక కొబ్బరికాయతో జరిపించారు. కట్నం తీసుకోకుండా సమాజానికి, ఈతరం యువతకు వికాస్ రాణా గొప్ప సందేశం ఇచ్చారు.