అక్షరటుడే, ఇందూరు: GPO | నిజామాబాద్‌లోని గ్రామ పాలన అధికారులు (Grama Palana Officers – GPOs) శనివారం (డిసెంబరు 27) కలెక్టర్‌ను కలిశారు. నిజామాబాద్ జిల్లా గ్రామ పాలన అధికారుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్లతోపాటు అర్హులైన అధికారుల ప్రొబెషన్‌ను ప్రకటించాలని వినతిలో కోరారు.
గతంలో పనిచేసిన వీఆర్ఏలు, వీఆర్ఓలను గత ప్రభుత్వం జీఓ ఎంఎస్ నం.81 ప్రకారం వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. కాగా, ప్రస్తుత ప్రభుత్వం జీఓ ఎంఎస్ నం.129 ద్వారా గ్రామ పాలన అధికారులుగా నియమించింది. ఈ మేరకు సదరు ఉద్యోగులు గ్రామ పాలన అధికారులుగా విధుల్లో చేరారు.
GPO| కంటిన్యూ సర్వీస్..
గ్రామ పాలన అధికారులుగా తిరిగి నియమించే సమయంలో Continuation of Service తో పాటు జీతభత్యాల పరిరక్షణ (Pay Protection) ఉంటుందని ప్రభుత్వం స్పష్టంగా హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
అయితే ప్రస్తుతం గ్రామ పాలన అధికారులకు వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్లు ఇంకా మంజూరు చేయలేదని, జీపీఓలుగా విధుల్లో చేరిన తరువాతి సంవత్సరం నుంచి ఇంక్రిమెంట్ నిబంధన వర్తిస్తుందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారని వాపోయారు.
దీనివల్ల తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి నియామకం వల్ల ఎలాంటి పదోన్నతి కానీ, ఆర్థిక లాభం కానీ పొందలేదని గుర్తుచేశారు. అలాంటప్పుడు వార్షిక ఇంక్రిమెంట్లు నిలిపివేయడం సర్కారు హామీకి పూర్తి విరుద్ధమన్నారు.
గ్రామ పాలన అధికారుల్లో చాలా మంది ఇప్పటికే రెండేళ్లకు పైగా నిరంతర సేవ పూర్తి చేశారని తెలిపారు. కొందరు రెవెన్యూ శాఖలో రీ-అపాయింట్మెంట్కు ముందే పనిచేశారని చెప్పారు. అయినప్పటికీ అర్హత ఉన్నవారికి ప్రొబెషన్‌ను ప్రకటించలేదన్నారు. ఇందుకు సంబంధిత అధికారులు కూడా సహకరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ప్రొబెషన్ కాలం కేవలం రెండేళ్లు మాత్రమేనని, శాఖ, పోస్టుతో సంబంధం లేకుండా అదే వర్తిస్తుందని స్పష్టం చేస్తూ, అర్హులైన జీపీవోలకు ప్రొబెషన్ డిక్లరేషన్ ఇవ్వాలని కలెక్టర్ ద్వారా సర్కారుని కోరారు.
GPO | నూతన కార్యవర్గం ఏర్పాటు..
అంతకు ముందు జీపీవోల నిజామాబాద్ జిల్లా సంఘం నూతన కార్యవర్గం ఏర్పడింది. అధ్యక్షుడిగా బియ్య సాయినాథ్, ప్రధాన కార్యదర్శిగా గున్నం సంతోష్, కోశాధికారిగా ప్రశాంత్, ఉపాధ్యక్షులుగా సుధాకర్, రమేష్, గంగాధర్, సహాయ కార్యదర్శులుగా భూపాల్, అఫ్రోజ్, మోహన్, ముఖ్య సలహాదారులుగా లింబగిరి, నరేష్, గంగాధర్, క్రీడా కార్యదర్శి సందీప్, కార్యవర్గ సభ్యులుగా అసదుద్దీన్, అరుణ, నిఖిల్, రాజన్న, అమృతరావు, వినోద్, శివకుమార్‌ను నియమించారు.