అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TTD | తిరుమలలో కొలువైన వేంకటేశ్వర స్వామిని (Lord Venkateswara Swamy) నిత్యం వేల మంది భక్తులు దర్శించుకుంటారు. టీటీడీ భక్తులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పలు టీటీడీ పలు ఆలయాలను, కల్యాణ మండపాలను నిర్మించింది. అంతేగాకుండా పలు ఆలయాలకు దూపదీప నైవేద్యం కోసం నిధులు కేటాయిస్తోంది. తాజాగా మహిళలకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.
వరలక్ష్మి వ్రతం (Varalakshmi Vratham) సందర్భంగా ఆగస్టు 8న మహిళలకు టీటీడీ, హిందూ ధర్మప్రచార పరిషత్ సంయుక్తంగా సౌభాగ్యం పేరిట గాజులు, పసుపు, కుంకుమ పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం సౌభాగ్యం సామాగ్రికి శ్వేతా భవనంలోని హాల్లో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల వారీగా పార్శల్ ప్యాకెట్లు సిద్ధం చేశారు.
TTD | 51 ఆలయాల్లో పంపిణీ
ఏపీ, తెలంగాణలో టీటీడీ (TTD) 51 ఆలయాలను నిర్వహిస్తోంది. వరలక్ష్మి వ్రతం రోజున మహిళలకు ఆయా ఆలయాల్లో సౌభాగ్యం పేరిట సామగ్రి పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ఆయా ఆలయాలకు పంపేందుకు సౌభాగ్యం సామగ్రిని గురువారం సిద్ధం చేశారు. మహిళలకు గాజులు, పద్మావతి అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, పసుపు దారాలు, పద్మావతి అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శత నామావళి పుస్తకం అందించనున్నారు. సౌభాగ్యవతులకు వీటిని పంపిణీ చేసేందుకు ఓ అజ్ఞాత భక్తుడు వీటిని విరాళం ఇచ్చారు. ఈ మేరకు ఎనిమిది లక్షల గాజులు, 1.40 లక్షల పసుపు దారాలు, 1.40 లక్షల కంకణాలు, 1.40 లక్షల కుంకుమ ప్యాకెట్లు, అష్టోత్తర శత నామావళి పుస్తక ప్రసాదాలను ఆయా ఆలయాలకు తరలించారు. కార్యక్రమంలో హిందూ ధర్మప్రచార పరిషత్ సంచాలకులు శ్రీరామ్ రఘునాథ్, శ్రీ రాంగోపాల్, ఏఈవో శ్రీరాములు, సూపరింటెండెంట్ ఢిల్లీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
TTD | పలు కార్యక్రమాలు
హిందూ ధర్మ వ్యాప్తికి టీటీడీ పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఆగస్టు 8న సౌభాగ్యం, ఆగస్టు 15న సన్మార్గం, ఆగస్టు 31న హరికథ వైభవం, అక్టోబర్ 2న మన వారసత్వం, 12న అక్షరగోవిందం, డిసెంబర్ 1న భగవద్గీతానుష్టానం (Bhagavad Gita Tanushtanam) కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.