అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | సామాజిక చైతన్య వేదికలు యూనివర్సిటీలు అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రారంభించారు.
ఈ సందర్బంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికి చదువుతోనే బంగారు భవిష్యత్తు లభిస్తుందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)ని అత్యున్నతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
CM Revanth Reddy | దొరల సిద్ధాంతానికి విరుద్ధం
గత పాలకులు ఉస్మానియా యూనివర్సిటీని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఓయూలో భూములను ప్లాట్లుగా చేసి అమ్ముకోవాలనుకున్నారని మండిపడ్డారు. గత పాలకులు ఏం చేశారో అందరూ చూశారన్నారు. వాళ్లు మళ్లీ వస్తే ఉస్మానియా వర్సిటీని బతుకనియ్యారు. లేఅవుట్లు చేసి అమ్ముకుంటారని హెచ్చరించారు. పేద పిల్లలు బాగా చదువుకుని బాగు పడొద్దన్నదే వాళ్ల ఏకైక కుట్ర అని మండిపడ్డారు. గొల్లొల్ల పిల్లలు గొర్లు కాసుకోవాలని, గౌడ విద్యార్థులు కల్లు గీసుకోవాలని, రజకుల పిల్లలు బట్టలు ఉతుక్కుంటూనే ఉండాలన్నదే వాళ్ల అభిమతమన్నారు. ఎవరి కుల వృత్తులు చేసుకోవాలి తప్పితే వారు ఎదగకూడదని, దొరలు మాత్రమే రాజ్యాలు ఏలాలన్నది వారి సిద్ధాంతమని ధ్వజమెత్తారు. కానీ అందుకు తాము పూర్తి విరుద్ధమని, ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని ఎదగాలన్నదే తమ సిద్ధాంతమని చెప్పారు.
CM Revanth Reddy | ఓయూ అభ్యున్నతికి కృషి
ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉందన్న రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదారని గుర్తు చేశారు. ఓయూ నుంచి ఎంతో మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయ్యారని, దేశంలో చక్రం తిప్పే స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. చదువు ఒక్కటే తలరాత మారుస్తుందని, అందుకే ఓయూ అభ్యున్నతికి కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఉస్మానియా వర్సిటీకి ఇంతిచ్చినా తక్కువేనని చెప్పారు. వర్సిటీని అద్భుతంగా తీర్చిదిద్దుతామని, ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. అవసరమైతే వేరే పథకాలకు నిధులు అపి, విద్య కోసం కేటాయిస్తామన్నారు. చదువుకు ఏం కావాలన్నా చేసే బాధ్యత తనదని చెప్పారు. పేదింటి ఆడబిడ్డల కోసం చాకలి ఐలమ్మ యూనివర్సిటీ (Chakali Ailamma University) తెచ్చామన్నారు. రూ.40 వేల కోట్లు పెట్టి యంగ్ ఇండియా స్కూళ్లు నెలకొల్పుతున్నామన్నారు. ఓయూ కళాశాల ముందే మరోసారి కార్యక్రమం నిర్వహిస్తామని ఉస్మానియా వర్సిటీకి తాను మళ్లీ వచ్చిన సమయంలో సెక్యూరిటీ పెట్టొద్దని పోలీసులకు సూచించారు.
CM Revanth Reddy | ఏం చేసినా విమర్శలే..
తెలంగాణ అభివృద్ధికి (Telangana Development) తాము కృషి చేస్తుంటే కొంత మంది కాళ్లలో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. చెరువుల పునరుద్ధరణకు హైడ్రా (Hydraa) కృషి చేస్తుంటే అడ్డు పడుతున్నారన్నారు. వర్షాలు పడి ఇళ్లలోకి నీళ్లు వస్తుంటే నాలాలు పునరుద్ధరించక పోతే ఏం చేయాలని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏం చేసినా అడ్డుపుల్లలు పెడుతున్నారని, సన్నబియ్యం ఇస్తామన్నా, రేషన్‌కార్డులు (Ration Cards) ఇస్తామన్నా అభ్యంతరాలు విమర్శలు చేస్తున్నారన్నారు. 20 నెలలో ఎన్నోపనులు చేశామని, వర్సిటీలకు వీసీలను నియమించాం, ఉద్యోగాల భర్తీచేశామని, డ్రగ్స్‌ను అడ్డుకుంటున్నామని, అయినా వారు విమర్శిస్తున్నారని తెలిపారు.
గంజాయిని నియంత్రిస్తే కూడా ప్రశ్నిస్తున్నారని, అసలు గంజాయి అమ్మేవాళ్లతో వాళ్లకు ఉన్న లాలూచీ ఏమిటని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అందరూ దీపావళికి చిచ్చుబుడ్లు కాలిస్తే వాళ్లేమో ఫామ్‌హౌస్‌లో డ్రగ్ తీసుకుంటున్నారని, అలాంటి వారిని పట్టుకుంటే దాన్ని కూడా తప్పుబట్టారని గుర్తు చేశారు. తెలంగాణలో గంజాయి విక్రయాలను అడ్డుకోవద్దా.. అలా చేయవద్దని చెబితే తాము దే చేస్తామని చెప్పారు. వాళ్లు తెలంగాణ సమాజానికి పట్టిన చెదలు అని బీఆర్ఎస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు. విద్యార్థులు చదువుకునే సమంయలో వేరే వ్యాపాకాలకు అలవాటు పడొద్దని, బాగా చదువుకుని ఎదగాలని సూచించారు.
CM Revanth Reddy | ఓయూ నుంచే ఎంతో మంది నేతలు..
తెలంగాణకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యామ్నాయ పదమని సీఎం అభివర్ణించారు. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉందన్నారు. దేశ రాజకీయాలను శాసించిన ఎంతో మంది నేతలు ఈ యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులేనని ఆయన గుర్తు చేశారు. కానీ కొందరు వ్యక్తులు.. ఉస్మానియా యూనివర్సిటీని కాలగర్భంలో కలపాలని చూశారని మండిపడ్డారు. కానీ ఓయూకు పూర్వ వైభవం తీసుకురావాలని తాము నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఆ క్రమంలో 108 ఏళ్ల చరిత్ర కలిగిన వర్సిటీకి దళితుడిని వీసీ చేసి చూపించామన్నారు. దేశానికి యువ నాయకత్వం అవసరమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమానికి పురిటి గడ్డ ఉస్మానియా వర్సిటీయేనని గుర్తు చేశారు. సమస్యలపై చర్చే కాదు..సైద్దాంతిక అంశాలకు వేదిక కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. సామాజిక, సాంకేతిక అంశాలపై చర్చలు జరపాల్సి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.