అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gold Price Crash | ఒకదానికొకటి పోటీ పడుతూ రాకెట్ వేగంతో దూసుకువెళ్లిన బంగారం, వెండి ధరలు (Gold and silver prices).. అంతకన్నా వేగంగా దిగిస్తున్నాయి. పుత్తడి ధర పతనమవుతుండగా.. వెండికొండ కరిగిపోతోంది. పెళ్లిళ్ల సీజన్ ముందు ధరలు తగ్గడంతో సామాన్యులుల కాస్త ఉపశమనం పొందుతున్నారు.
కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న జియో పొలిటికల్ టెన్షన్స్, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (US Presiden Donald Trump) ఎన్నికైన తర్వాత శత్రు, మిత్ర భేదం లేకుండా విధిస్తున్న టారిఫ్‌లతో ఏర్పడిన ఆర్థిక అనిశ్చిత పరిస్థితులతో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి మార్గాలను వెతుక్కుంటున్నారు. అలాంటివారు బంగారం, వెండి వంటి మెటల్స్‌లో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. దీనికితోడు డీడాలరైజేషన్‌కు పలు దేశాలు ప్రాధాన్యత ఇచ్చాయి. ఇదే సమయంలో చాలా దేశాల కేంద్ర బ్యాంకులు బంగారు నిల్వలను పెంచుకున్నాయి. దీంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఇటీవల పది గ్రాము స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1.80 లక్షలు, కిలో వెండి ధర రూ. 4 లక్షలు దాటిన సంగతి తెలిసిందే.
Gold Price Crash | ట్రంప్ ప్రకటనతో దిగివచ్చిన ధరలు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో కొండెక్కిన బంగారం, వెండి ధరలు.. తిరిగి అదే ట్రంప్ కారణంగా దిగివస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్‌గా జెరోమ్ పావెల్ స్థానంలో కెవిన్ వార్ష్ పేరును ట్రంప్ ప్రతిపాదించారు. ఆయన డాలర్ బలోపేతానికి ప్రాధాన్యత ఇస్తారన్న పేరుంది. దీంతో ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలోపేతం అవుతుందన్న అంచనాలతో ఇన్వెస్టర్లు ఈ నిర్ణయాన్ని ప్రతికూలంగా తీసుకున్నారు. మరోవైపు ఇరాన్‌తో డీల్ ఉంటుందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన సంకేతాలతో జియో పొలిటికల్ టెన్షన్స్ తగ్గే అవకాశాలున్నాయి.
ఈ కారణంతోనూ ఈ రెండు లోహాల ధరలు దిగి వస్తున్నాయని అనలిస్టులు పేర్కొంటున్నారు. గరిష్టాల వద్ద లాభాల స్వీకరణతో శుక్రవారం భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. సోమవారం మరింత తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో (Hyderabad bullion market) సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1.48 లక్షల వద్ద ఉండగా.. కిలో వెండి ధర రూ. 2.48 లక్షల వద్ద కొనసాగుతోంది. కమోడిటీల ట్రేడింగ్ జరిగే మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో 10 గ్రాముల బంగారం ఏప్రిల్ కాంట్రాక్టు ధర రూ.1,39,446 వద్ద, కిలో వెండి మార్చి కాంట్రాక్టు ధర రూ.2.27 లక్షల వద్ద కొనసాగుతున్నాయి.
Gold Price Crash | పెళ్లిళ్ల సీజన్లో ఊరట
రాకెట్ స్పీడ్‌తో పైకి దూసుకువెళ్తున్న బంగారం, ధరలు సామాన్యులను ఆందోళనకు గురిచేశాయి. ఈ నెలలో వివాహాది శుభకార్యాలు జోరుగా సాగనున్నాయి. ఈ నేపథ్యంలో కొండెక్కిన ధరలతో బంగారం, వెండి ఎలా కొనాలా అని ఆందోళన చెందుతున్న సామాన్యులకు ప్రస్తుతం తగ్గిన ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి. అయితే భారీగా ధర తగ్గడంతో బంగారం కొనడానికి ఇదే మంచి సమయమని పలువురు భావిస్తుండగా.. మార్కెట్ మరిన్ని కనిష్టాలను తాకుతుందేమోనని భయపడుతున్నవారు కొనాలా మరికొన్నాళ్లు ఆగాలా అన్న డైలమాలో ఉన్నారు. ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందేమోనని కొద్దిరోజులు వేచి చూడడం లేదా విడతల వారీగా కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు