అక్షరటుడే, వెబ్డెస్క్ : GHMC Election Sanitation Drive | గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పాలకవర్గం పదవీకాలం ముగిసింది. దీంతో త్వరలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో అధికార కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి ఇప్పటి నుంచే కసరత్తు చేస్తోంది.
జీహెచ్ఎంసీనీ మూడు కార్పొరేషన్లుగా విభజించిన విషయం తెలిసిందే. గతంలో అన్ని వార్డుల్లో నెల రోజుల పాటు పారిశుధ్య డ్రైవ్ చేపట్టారు. తాజాగా మరోసారి ఆయా శాఖల అధికారులు బస్తీ బాట పట్టారు. జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల పరిధిలో నిత్యం సానిటేషన్ డ్రైవ్ (Sanitation drive) చేపడుతున్నారు. ఆయా కార్పొరేషన్ల కమిషనర్లతో పాటు జోనల్ కమిషనర్లు, అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఇందిరా పార్క్, గాంధీ నగర్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు విస్తృతంగా పారిశుద్ధ్య తనిఖీలు నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అధికారులు స్వచ్ఛ ఆటో కార్మికులు రోజువారీ ఇంటింటికీ చెత్త సేకరణను ఖచ్చితంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.
GHMC Election Sanitation Drive | జల మండలి అధికారులు
జలమండలి (Water Board) అధికారులు బస్తీబాట పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గోల్కొండ జోన్ పరిధిలోని నానల్ నగర్ చౌరస్తా వద్ద సీవరేజ్ మరమ్మత్తు పనులను ఎండీ అశోక్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. నిత్యం పలు ప్రాంతాల్లో పనులు చేపడుతుండగా.. అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సమస్యలు తెలుసుకుంటున్నారు. వెంటనే వాటిని పరిష్కరిస్తున్నారు. ప్రాజెక్టు అధికారులతో సమన్వయం చేస్తూ సీవరేజ్ నెట్‌వర్క్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
GHMC Election Sanitation Drive | ఎన్నికల వేళ..
జీహెచ్ఎంసీ ఎన్నికలు ఏప్రిల్ చివరి వారం లేదా మేలో జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో అప్పటి వరకు ఆయా కాలనీలు, బస్తీల్లో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గతంలో సమస్యలు ఉన్నాయని ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు.. ఇప్పుడు నిత్యం బస్తీల్లో పర్యటిస్తుండటంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికల వేళ మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారని చర్చించుకుంటున్నారు.

