అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bangladesh | బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు రోజురోజుకూ మరింత ఆందోళనకరంగా మారుతున్నాయి. తాజాగా ఢాకాలో జరగాల్సిన ప్రముఖ అంతర్జాతీయ గాయకుడు జేమ్స్ సంగీత కచేరీ హఠాత్తుగా రద్దు కావడం కలకలం రేపింది.
ఈ కచేరీ రద్దుకు ప్రధాన కారణం ఆందోళనకారుల దాడులేనని నిర్వాహకులు వెల్లడించారు. బంగ్లాలో అత్యంత ప్రజాదరణ పొందిన గాయకుడు ఫరూక్ మహ్మద్ సజ్జాద్ ఉద్దీన్ (Singer Farooq Muhammad Sajjad Uddin), అందరికీ జేమ్స్‌గా సుపరిచితుడు. ఆయన సంగీత కచేరీని ఢాకాలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే వేళ, ఆ గుంపులో ఆందోళనకారులు కూడా కలిసిపోయారు.
Bangladesh | పరిస్థితులు ఉద్రిక్తంగా..
ఒక్కసారిగా వారు వేదికపైకి చొచ్చుకువచ్చి దాడికి పాల్పడ్డారు. వేదికపై ఏర్పాటు చేసిన కుర్చీలు, మైకులు, లైటింగ్ సెట్స్‌తో పాటు ఇతర సంగీత పరికరాలను ధ్వంసం చేశారు. భద్రతా సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా, ఆందోళనకారుల ఉగ్రత్వం ముందు వారు విఫలమయ్యారు. పరిస్థితి మరింత విషమించడంతో కళాకారులు, సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని కచేరీని వెంటనే రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ ఘటనతో జేమ్స్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎంతో ఉత్సాహంగా ఎదురుచూసిన సంగీత కార్యక్రమం అశాంతి కారణంగా మధ్యలోనే రద్దు కావడం వారిని కలచివేసింది. ఢాకా నగరం (Dhaka City) ఒకప్పుడు ప్రశాంతంగా, కళా–సాంస్కృతిక కార్యక్రమాలతో కళకళలాడేదని, ఇప్పుడు మాత్రం భయాందోళనలతో నిండిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా షేక్ హసీనా ప్రభుత్వం (Sheikh Hasina Government) పడిపోయినప్పటి నుంచి బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మరింత అస్థిరంగా మారుతున్నాయి. కేవలం సంగీత కచేరీలే కాకుండా, సాంస్కృతిక కేంద్రాలు, విగ్రహాలు, ప్రజా కట్టడాలపై కూడా వరుస దాడులు జరుగుతున్నట్లు సమాచారం. కొందరు మతోన్మాద శక్తులు ఈ విధ్వంసాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితులు దేశంలో సాంస్కృతిక వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.