అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Galgotias University AI Controversy | ఓ యూనివర్సిటీ చైనా ఎదుట భారత్ పరువు తీసింది. చైనా (china) తయారు చేసిన రోబోటిక్ డాగ్‌ను (Robotic dog) తాము ఆవిష్కరించినట్లు ఏఐ సదస్సులో ప్రదర్శనకు ఉంచింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలో (Delhi) ఏఐ సదస్సు (AI Conference) నిర్వహిస్తోంది. ఇందులో వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో దేశంలోని పలు యూనివర్సిటీలు, స్టార్టప్‌లు తమ ఆవిష్కరణలను ప్రదర్శనకు ఉంచాయి. యూపీలోని గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ ఈ సదస్సుల్లో స్టాల్‌ను ఏర్పాటు చేసింది. రోబోడాగ్‌ను అందులో ప్రదర్శించారు. యూనివిర్సిటీ ప్రొఫెసర్ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో దీనిని తయారు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Galgotias University AI Controversy | నెటిజన్ల ఆగ్రహం
వీడియో వైరల్ కావడంతో రోబో డాగ్ గురించి నెటిజన్లు తెలుసుకున్నారు. దానిని చైనా తయారు చేసినట్లు గుర్తించారు. ఇతర దేశంలో తయారు చేసిన రోబో డాగ్‌ను కొనుగోలు చేసి తాము తయారు చేసినట్లు చెప్పుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనా నెటిజన్లు అయితే దీనిపై ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో భారత్ పరువు తీశారంటూ సదరు యూనివర్సిటీపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వివాదం పెద్దది కావడంతో యూనివర్సిటీ వివరణ ఇచ్చింది. దానిని చైనా నుంచి కొనుగోలు చేశామని తెలిపింది. విద్యార్థులు నేర్చుకోవడానికి ఉపయోగిస్తున్నట్లు చెప్పింది. ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఏఐ సదస్సు నుంచి సదరు యూనివర్సిటీని పంపించి వేసింది. స్టాల్ నుంచి యూనివర్సిటీ ప్రతినిధులను అధికారులు ఖాళీ చేయించారు.