అక్షరటుడే, ఎల్లారెడ్డి : MLA Madan Mohan | ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు రూ.2.08కోట్లు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) జీవో జారీ చేసింది. వీటిని నాగిరెడ్డిపేట మండల పరిధిలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ ముంపు ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్, ప్రవాహ మార్గంలో అడ్డంకులు తొలగించేందుకు వినియోగించనున్నారు.
ఈ నిధుల విడుదలతో వర్షాకాలంలో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల నష్టపోతున్న రైతులకు భారీ ఉపశమనం కలుగనుంది. వర్షాకాలంలో నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ కారణంగా వ్యవసాయ భూములు ముంపునకు గురై పంట నష్టం వాటిల్లుతోంది. ఈ సమస్యను మొదటి నుంచి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు నష్టం కలగకుండా జంగిల్ క్లియరెన్స్ తప్పకుండా చేస్తానని ఇచ్చిన హామీని ఆయన నెరవేర్చారు.
MLA Madan Mohan | శాసనసభలో ప్రస్తావన..
ఈ అంశాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ శాసనసభ సమావేశాల్లో పలుమార్లు ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy)ని స్వయంగా కలిశారు. నిజాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కారణంగా ఎల్లారెడ్డి నియోజకవర్గం (Yellareddy Constituency)లో ముఖ్యంగా నాగిరెడ్డిపేట మండల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల పరిస్థితిని అర్థం చేసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూల స్పందనతో ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసింది. దీంతో నిజాంసాగర్ బ్యాక్‌వాటర్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.