అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Congress Nizamabad | నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (Nizamabad Municipal Corporation) పరిధిలోని 60 డివిజన్ల సమగ్ర అభివృద్ధి కోసం రూ.60 కోట్ల నిధులతో పనులు చేపట్టినట్లు ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ (Shabbir Ali), పీసీసీ చీఫ్ (PCC Chief), ఎమ్మెల్సీ బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్(Bomma Mahesh Kumar Goud) పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
Congress Nizamabad | డివిజన్‌కు రూ.కోటి..
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 60 డివిజన్లలో ఒక్కో డివిజన్‌కు రూ.కోటి చొప్పున కేటాయిస్తున్నామని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. దీంతో నగర రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
Congress Nizamabad | సబ్‌స్టేషన్ నిర్మాణం..
నగరంలో విద్యుత్ సమస్య రాకుండా ఉండేందుకు రూ. 6 కోట్లతో 33/11 కేవీ సబ్ స్టేషన్‌ను నిర్మిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు తెలిపారు. నగర ప్రజలకు విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఈ అభివృద్ధిని చూసి కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటెయ్యాలని కోరారు.
Congress Nizamabad | అంతర్గత రోడ్లు.. డ్రెయినేజీ వ్యవస్థ..
నగరంలో మౌలిక సదుపాయాలు, డ్రెయినేజీ వ్యవస్థ మెరుగుదల, అంతర్గత రోడ్ల నిర్మాణం, వీధిదీపాల ఏర్పాటు వంటి మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నట్లు షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. తమది గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా మాటల ప్రభుత్వం కాదని.. చేతల ప్రభుత్వమన్నారు. ఇందిరమ్మ రాజ్యం లక్ష్యంగా పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో నిజామాబాద్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని, నగరాన్ని ఒక ‘మోడల్ సిటీ’గా తీర్చిదిద్దే బాధ్యతను కాంగ్రెస్ పార్టీకి అప్పగించాలని ఆయన అన్నారు.
Congress Nizamabad | నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి..
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. నిజామాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని అన్నారు. ఈ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్నదే మా సంకల్పం అని పేర్కొన్నారు. రూ.60 కోట్లు అనేది కేవలం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
Congress Nizamabad | అవినీతి రహిత పాలన అందిస్తాం
గత ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి కంటే, పారదర్శకమైన, వేగవంతమైన పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులను ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు. తాము చేస్తున్న ఈ రూ.60 కోట్ల అభివృద్ధి పనులే మన విజయానికి పునాది అని పేర్కొంటూ, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నుడా ఛైర్మన్ కేశ వేణు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రామకృష్ణ, అరికెల నర్సారెడ్డి, నరాల రత్నాకర్, జిల్లా కలెక్టర్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.