అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Phone Tapping Case | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు, అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ (Jubilee Hills Police Station)లో లొంగిపోయారు.
బీఆర్ఎస్ హయాంలో పలువురి ఫోన్లను ట్యాప్ చేసినట్లు కేసు నమోదైన విషయం తెలిసిందే. ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేతలు, సినీ ప్రముఖులు, వ్యాపారులు, జడ్జీల ఫోన్లను ట్యాప్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దీనిపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ప్రభాకర్‌రావు, మరో నిందితుడు ప్రణీత్‌రావు కలిసి ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు ధ్వంసం చేశారు. ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయాడు. దీనిపై సిట్ సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించడంతో ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఆ సమయంలో న్యాయస్థానం ఆయనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది.
Phone Tapping Case | విచారణకు సహకరించకపోవడంతో..
అమెరికా నుంచి వచ్చిన తర్వాత ప్రభాకర్‌రావు (SIB Chief Prabhakar Rao)ను పలుమార్లు సిట్ విచారించింది. అయితే ఆయన విచారణకు సహకరించలేదు. దీంతో అరెస్ట్‌కు అనుమతి ఇవ్వాలని గతంలోనే ప్రభుత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై గురువారం వాదనలు విన్న ధర్మాసనం అరెస్ట్ నుంచి గతంలో కల్పించిన రక్షణను ఉపసంహరించుకుంది. శుక్రవారం పోలీసుల ఎదుట సరెండర్ కావాలని ఆదేశించింది. భౌతికంగా ఆయన్ని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా చూడాలని కోర్టు పేర్కొంది. సుప్రీం ఆదేశాల మేరకు ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణాధికారి, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి (Jubilee Hills ACP Venkatagiri) ముందు సరెండర్ అయ్యారు.
Phone Tapping Case | అరెస్ట్ తప్పదా..
రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచింది. ప్రభాకర్‌రావు సరెండర్ కావడంతో ఆయనను అధికారులు సిట్ అధికారులు విచారించనున్నారు. అనంతరం అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే నిందితులను సిట్ విచారించింది. ఫోన్ ట్యాపింగ్‌కు గురైన బాధితుల స్టేట్మెంట్ కూడా రికార్డు చేసింది. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్లు ట్యాప్ చేశారనే విషయాన్ని సిట్ రాబట్టే అవకాశం ఉంది. అప్పటి ప్రభుత్వ పెద్దల పేరు చెబితే వారిపై సైతం కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు.