అక్షరటుడే, వెబ్‌డెస్క్:Ajit Doval | ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌కు వ్యతిరేకంగా విష ప్రచారం జరిగిందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్(Ajit Doval) విమర్శించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ అది చేసింది, ఇది చేసిందని విదేశీ మీడియా అసత్యాలు ప్రచారం చేసిందని మండిపడ్డారు. భారత్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందంటూ దుష్ప్రచారానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. తమకు నష్టం జరిగినట్లు ఏ ఒక్క ఆధారమైన చూపగలరా? అని ప్రశ్నించారు. చెన్నైలోని ఐఐటీ మద్రాస్ 62వ స్నాతకోత్సవంలో ధోవల్ మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) వివరాలను వెల్లడిస్తూ భారత సైనిక సత్తాను ప్రశంసించారు. పాకిస్తాన్(Pakistan)లో తాము కచ్చితమైన దాడులకు చేశామని, ఆపరేషన్ సమయంలో ఇండియాకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు.
Ajit Doval | అత్యంత కచ్చితత్వంతో దాడులు..
సరిహద్దు ప్రాంతాలకు దూరంగా, పాకిస్తాన్ అంతర్భాగంలో ఉన్న తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలను గుర్తించి విజయవంతంగా ధ్వంసం చేశామని ధోవల్ వెల్లడించారు. స్వదేశీ టెక్నాలజీతో అత్యంత కచ్చితత్వంతో దాడులు చేశామన్నారు. పాకిస్తాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో మనకు ఎటువంటి నష్టం జరుగలేదని తెలిపారు. భారతదేశ నిఘా(Indian intelligence), కార్యాచరణ ఖచ్చితత్వానికి ఆపరేషన్ సిందూర్ నిదర్శనమని అభివర్ణించారు. మొత్తం ఆపరేషన్‌ను కేవలం 23 నిమిషాల్లోనే అమలు చేశామని, ఎటువంటి తప్పుకు అవకాశం లేకుండా, ఎలాంటి నష్టం జరగకుండా ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశామన్నారు.
Ajit Doval | ఒక్క ఆధారమైనా చూపగలరా?
ఆపరేషన్ సిందూర్ సమయంలో విదేశీ మీడియా(Foreign media) దుష్ప్రచారం చేసిందని ధోవల్ విమర్శించారు. ఇండియా(India)కు నష్టం వాటిల్లిందని పాకిస్తాన్ చెప్పినట్లే ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. ది న్యూయార్క్ టైమ్స్(The New York Times) వంటి ప్రముఖ పత్రికలు భారత్ తీవ్రంగా నష్టపోయిందని విస్తృతంగా రాశాయని గుర్తు చేసిన ఆయన.. అందుబాటులో ఉన్న ఉపగ్రహ చిత్రాలు వేరే వాస్తవాన్ని చూపించాయని ధోవల్ ఎత్తి చూపారు. భారతదేశ వ్యూహాత్మక కార్యకలాపాల విశ్వసనీయతను ప్రశ్నించిన విమర్శకులను ఉద్దేశిస్తూ.. “భారతీయులకు జరిగిన నష్టం చూపించే ఒక్క ఛాయాచిత్రం ఉంటే చూపించడని” అని సవాల్ చేశారు. “మే 10కి ముందు, తరువాత పాకిస్తాన్‌కు చెందిన 13 వైమానిక స్థావరాలను చిత్రాలు వాస్తవాలేమిటో చూపించాయి. భారత స్థావరాలపై ఒక్క గీత కూడా లేదు. అదే నిజం,” అని ఆయన నొక్కి చెప్పారు.
Ajit Doval | రక్షణ రంగంలో స్వావలంబన..
పాకిస్తాన్‌లో అంతర్గతంగా అత్యంత కచ్చితమైన ఉగ్రవాద నిరోధక ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించామని ధోవల్ తెలిపారు. రక్షణ సామర్థ్యాలలో పెరుగుతున్న స్వావలంబనను వివరించారు. స్వదేశీ రక్షణ సాంకేతికతను అభివృద్ధి చేయాలన్న ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.