అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Flipkart-Amazon | ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్టు, అమెజాన్ పండుగ ఆఫర్లను ప్రకటించాయి. ఈ నెల 23 నుంచి ఫెస్టివల్ సేల్ ప్రారంభమవుతుందని ప్రకటించాయి. జీఎస్టీ రేటు కోతలు అమల్లోకి వచ్చిన తర్వాతి రోజు నుంచే తమ ఫ్లాగ్‌షిప్ పండుగ సీజన్ అమ్మకాలను ప్రారంభించనున్నాయి.
కీలకమైన పండుల షాపింగ్ కాలంలో విక్రయాలను మరింత పెంచుకోవడానికి ఆయా ప్లాట్‌ఫారమ్‌లు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్(Flipkart Big Billion Days), అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్(Amazon Great Indian Festival) ఫ్లాగ్‌షిప్ సేల్ ఈవెంట్‌ల లాంచ్ తేదీలను తమ యాప్‌లలో వెల్లడించాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్. బ్లాక్ సభ్యులు, అలాగే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకు ఒకరోజు ముందు నుంచే అంటే సెప్టెంబర్ 22 నుంచి ఆఫర్లకు యాక్సెస్‌ను పొందుతారు.
Flipkart-Amazon | జీఎస్టీ రేట్ల సవరణతో..
కేంద్ర ప్రభుత్వం(Central Government) ఇటీవల పన్నుల వ్యవస్థను సరళీకృతం చేసింది. జీఎస్టీలో గతంలో ఉన్న 12, 128 స్లాబ్‌లను ఎత్తివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే అనేక మార్పులు చేసింది. ఆయా నిర్ణయాలు సెప్టెంబర్ 22 నుండి అమలులోకి రానున్నాయి. ఎయిర్ కండిషనర్లు, టెలివిజన్లు, డిష్‌వాషర్లు, మానిటర్లు, ప్రొజెక్టర్లు, సెట్-టాప్ బాక్స్‌లు వంటి పెద్ద పెద్ద ఉపకరణాలపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతుంది. ఈ మార్పులు కొనుగోలుదారుల స్థోమతను మెరుగుపరుస్తాయని, ఈ క్రమంలో పండుగల వేళ వాటికి డిమాండ్ పెరుగుతుందన్న అంచనాలతో ఈ కామర్స్ సంస్థలు(E-Commerce Companies) సెప్టెంబర్ 23 నుంచి ఆఫర్లను ప్రకటించాయి.
ఈ వారం ప్రారంభంలో రెండు ప్లాట్‌ఫామ్‌లు GST కౌన్సిల్ నిర్ణయాన్ని స్వాగతించాయి.
జీఎస్టీ తగ్గింపుతో ఈసారి భారీగా విక్రయాలు జరుగుతాయని ఆయా సంస్థలు భావిస్తున్నాయి. ప్రధానంగా టెలివిజన్లు, ఎయిర్ కండిషనర్లు. ఇతర పెద్ద ఎలక్ట్రికల్ ఉపకరణాలకు భారీ డిమాండ్ ఉంటుంటదని అంచనా వేస్తున్నాయి. 2025లో పండుగ సీజన్ అమ్మకాలు సంవత్సరానికి 27 శాతం పెరిగి రూ. 1.2 లక్షల కోట్లకు చేరుకోవచ్చని డేటామ్ ఇంటెలిజెన్స్(Datam Intelligence) నివేదిక అంచనా వేసింది. గతేడాది ఇదే సమయంలో దాదాపు రూ. 1 లక్ష కోట్లు ఉండగా, 2023లో రూ. 81,000 కోట్ల మేర విక్రయాలు జరిగాయి.