అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nagireddypet mandal | నాగిరెడ్డిపేట మండలంలో మంజీర పరీవాహక ప్రాంతాల గ్రామాలకు చెందిన రైతులు రోడ్డెక్కారు. మండల కేంద్రంలో సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా నిర్వహించారు. భారీ వర్షాలకు (heavy rains) పోటెత్తిన వరదతో వందల ఎకరాల్లో పంటలు ముంపునకు గురై నష్టపోయి వాపోయారు.
ప్రభుత్వం తమను ఆర్థికంగా వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ (former MLA Jajala Surender) మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాగిరెడ్డిపేట మండలంలో పంటలు, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. పంట నష్టం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించకుండా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తాడ్వాయి మండలానికి వచ్చివెళ్లాడని, విహారయాత్రకు వచ్చి వెళ్లినట్టుగా తన పర్యటన సాగిందని మండిపడ్డారు. సీఎం నియోజకవర్గానికి వచ్చి వెళ్లి 20 రోజులు గడుస్తున్నా నేటికీ రైతులకు (Farmers) నష్టపరిహారం అందలేదని పేర్కొన్నారు. రోడ్లకు మరమ్మతులు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పంట నష్ట పోయిన రైతన్నలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరాకు 50,000 చొప్పున అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో హైదరాబాద్ – ఎల్లారెడ్డి (Hyderabad-Yellareddy) ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో పోలీసులు ఆర్డీవోతో మాజీ ఎమ్మెల్యేకు ఫోన్లో మాట్లాడించగా.. వారం రోజుల్లో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు బొల్లి నరసింహారెడ్డి, మాజీ జెడ్పీటీసీలు మనోహర్ రెడ్డి, రాజదాస్, జయరాజ్, మాజీ ఎంపీపీ ముదాం సాయిలు, ఆదిమూలం సతీశ్, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.