అక్షరటుడే, వెబ్డెస్క్ : Bijapur Encounter | ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అయితే పోలీసులు దీనిని అధికారికంగా ధృవీకరించలేదు.
బీజాపూర్ జిల్లాలోని తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం-మరిమల అడవుల్లో నక్సల్స్ ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు బుధవారం సెర్చ్ ఆపరేషన్ (Search Operation) చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు వారికి ఎదురు పడ్డారు. అనంతరం నక్సల్స్ కాల్పులు జరపగా.. భద్రత బలగాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఆయుధాలు, నక్సలైట్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రెండు వైపుల నుంచి కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలోని దట్టమైన అడవులు, క్లిష్ట భూభాగం సైనికులకు ఆపరేషన్‌ను కష్టతరం చేస్తున్నాయి. గాయపడిన, తప్పించుకున్న నక్సలైట్ల కోసం ఎన్‌కౌంటర్ ముగిసిన తర్వాత ఈ ప్రాంతంలో కూంబింగ్ చేపడుతామని పోలీసు అధికారులు తెలిపారు. బీజాపూర్, తెలంగాణ పోలీసులు (Telangana Police) ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు.
Bijapur Encounter | ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ స్వాధీనం
మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆపరేషన్ కగార్ (Operation Kagar)తో వందలాది మంది ఎన్కౌంటర్లో మృతి చెందారు. మరికొంత మంది అడవులను వీడి లొంగిపోయారు. ఇటీవల కీలక నేతలు తమ అనుచరులతో కలిసి ఆయుధాలను అప్పగించి సరెండర్ అయ్యారు. తాజాగా సుక్మా అడవుల్లో బలగాలు మావోయిస్టుల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకున్నాయి. గోంగూడ -కంచాల అడవుల్లో డిస్టిక్ రిజర్వ్ గార్డ్ (DRG) బలగాలు మంగళవారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఆ ప్రాంతంలో ఆయుధ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని గుర్తించి 17 రైఫిల్స్, రాకెట్ లాంచర్లు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి.
