అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Election Commission | బీహార్‌లో పెద్ద ఎత్తున ఓటర్ల తొలగింపు జరిగిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఎన్నికల కమిషన్ మరోసారి తిప్పికొట్టింది. రాహుల్ చెబుతున్న సుబోధ్‌కుమార్ అనే వ్యక్తి ఓటు తొలగించినట్లు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, అతనికి అసలు ఓటు హక్కే లేదని స్పష్టం చేసింది. ఓటరు జాబితాలోనే పేరు లేనప్పుడు, ఇక తొలగించడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది.
Election Commission | వీడియో పోస్టు చేసిన రాహుల్..
భారీగా ఓటర్లను తొలగించారని పేర్కొంటూ రాహుల్‌గాంధీ(Rahul Gandhi) బుధవారం సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో సుబోధ్ కుమార్ అనే వ్యక్తి డ్రాఫ్ట్ ఓటరు జాబితా నుంచి తన పేరును తొలగించారని ఆరోపించారు. “సుబోధ్ కుమార్(Subodh Kumar) జీకి ఏమి జరిగిందో అది బీహార్‌లోని లక్షలాది మందికి జరుగుతోంది. ఓటు దొంగతనం చేయడమంటే భారతమాతపై దాడి చేయడమే. బీహార్ ప్రజలు దీనిని జరగనివ్వరు” అని రాహుల్‌గాంధీ Xలో పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన ఈసీ అది తప్పుడు ఆరోపణ అని పేర్కొంది.
Election Commission | జాబితాలోనే పేరు లేదు..
సుబోధ్‌కుమార్ రాష్ట్రీయ జనతా దళ్‌కు చెందిన బూత్ లెవల్ ఏజెంట్ అని, అతను సాధారణ ఓటరు కాదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కి ముందు కూడా సుబోధ్ కుమార్ పేరు ఓటర్ల జాబితాలో లేదని, అందువల్ల ఆయన పేరు తొలగింంచామన్న ఆరోపణ కూడా అబద్ధమని తెలిపింది. సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాలకు అనుగుణంగా ప్రచురించిన తొలగించిన ఓటర్ల జాబితాలోనూ కుమార్ పేరు లేదని కమిషన్ ఎత్తి చూపింది. ముసాయిదా జాబితా ప్రచురించిన తర్వాత ఫారం-6 కింద లేదా అవసరమైన ప్రకటన కింద అతను ఎటువంటి క్లెయిమ్ లేదా అభ్యంతరాన్ని సమర్పించలేదు. పోలింగ్ స్టేషన్ నంబర్ 10 వద్ద తొలగింపు జాబితాను ప్రజా నోటీసు కోసం అతికించినప్పుడు కుమార్ స్వయంగా అక్కడ ఉన్నాడు కానీ ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని కమిషన్ గుర్తు చేసింది. సుబోధ్ ఫారం-6 తో పాటు అవసరమైన పత్రాలు అందజేస్తే ఓటు హక్కు కల్పిస్తామని పేర్కొంది.
రాహుల్ గాంధీ ఓటు చోరీ ఆరోపణలను ఎన్నికల సంఘం(Election Commission)తిప్పికొట్టడం ఇదే తొలిసారి కాదు. ఈ నెల ప్రారంభంలో ఔరంగాబాద్‌లో మాట్లాడిన రాహుల్‌గాంధీ.. రంజు దేవి అనే మహిళ గురించి చెబుతూ ఆమె మొత్తం కుటుంబాన్ని ఓటర్ల జాబితా నుంచి తొలగించారని ఆరోపించారు. అయితే, ఆ ఆరోపణలు తప్పని సదరు మహిళా మీడియా ముందుకొచ్చి చెప్పడం విశేషం. ఆమె వ్యాఖ్యల వీడియోను విడుదల చేసిన ఎన్నికల కమిషన్.. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయని తేల్చి చెప్పింది.