అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maharashtra | మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన వైద్యురాలి ఆత్మహత్య (Doctor Suicide) కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై గోపాల్ బదానే లొంగిపోయాడు. ఎస్సై వేధింపులతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె అరచేతిలో సూసైడ్ నోట్ రాసిన విషయం తెలిసిందే.
మహారాష్ట్రలోని సతార జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ వైద్యురాలు (26) రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై గోపాల్ బాదానే (SI Gopal Badane) తనపై అత్యాచారం చేశాడని ఆమె చేతిలో సూసైడ్ నోట్ రాసింది. ఎస్సై వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఆమె ఇంట్లో నాలుగు పేజీల సూసైడ్ నోట్ కనుగొన్నారు.
Maharashtra | ఎంపీపైనా ఆరోపణలు
తనను ఓ ఎంపీ సైతం బెరించాడని ఆమె లేఖలో ఆరోపించింది. వైద్య పరీక్షలకు తీసుకు రాకుండానే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని పోలీసులు తనను ఒత్తిడి చేశారని పేర్కొంది. అయితే తాను అందుకు నిరాకరించడంతో ఎస్సై గోపాల్‌తో పాటు మరికొందరు పోలీసు అధికారులు వేధింపులకు గురిచేశారని వాపోయింది. ఎస్సై తనపై అత్యాచారం చేశాడని, వేధింపులకు పాల్పడ్డాడని తెలిపింది. తప్పుడు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో ఓ ఎంపీ సైతం తనను బెదిరించారని ఆమె లేఖలో పేర్కొంది. తన ఇంటి యజమాని కుమారుడు ప్రశాంత్ బంకర్ సైతం వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది.
Maharashtra | నిందితులపై కేసు నమోదు
వైద్యురాలి ఆరోపణల నేపథ్యంలో ఎస్సై గోపాల్, ఇంటి యజమాని కుమారుడు ప్రశాంత్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సైని సస్పెండ్ చేయడంతో మరో నిందితుడు ప్రశాంత్‌ను ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే తాజాగా ఎస్సై గోపాల్ లొంగిపోయాడు. ఫల్తాన్ పోలీస్ స్టేషన్ (Phaltan Police Station)లో ఆయన లొంగిపోయాడు.

