అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Case | రాష్ట్రంలో అనేక మంది అవినీతి అధికారులు ప్రజలను వేధిస్తున్నారు. లంచాలు తీసుకోనిదే పనులు చేయడం లేదు. ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయాల్లో (Municipal Offices) అవినీతి రాజ్యం ఏలుతోంది. అయితే అలాంటి వారిపై చర్యలు కరువు అయ్యాయి. ఏసీబీ కేసులు నమోదు అవుతున్నా.. కఠిన చర్యలు తీసుకోకపోవడంతో లంచాలకు మరిగిన అధికారులు మారడం లేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏసీబీ దాడులు (ACB Raids) పెరిగాయి. లంచాలు తీసుకుంటున్న వారిని రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పలు కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. పాఠశాలలు, హాస్టళ్లలో కూడా ఏసీబీ సోదాలు చేపడుతోంది. అయినా కూడా అవినీతి అధికారులు మారడం లేదు. దీనికి కారణం ఏసీబీకి చిక్కిన తర్వాత కఠిన చర్యలు లేకపోవడమే. ఒక సారి ఏసీబీకి దొరికిన వారికి నాలుగు రోజులు సస్పెండ్ (Suspended) చేసి, తర్వాత మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నారు. దీంతో లంచాలకు మరిగిన అధికారులు ఏ మాత్రం భయపడకుండా డబ్బులు తీసుకుంటున్నారు.
ACB Case | ఏసీబీ కేసుల వివరాలు
గత ఐదేళ్లలో ఏసీబీ 621 కేసులు నమోదు చేసింది. ఇందులో 25 శాతం కేసులు మాత్రమే ప్రాసిక్యూషన్ అనుమతి లభిస్తుంది. మిగిలినవి క్రమశిక్షణా చర్యల కోసం విభాగాధిపతులకు లేదా ట్రిబ్యునల్‌కు వెళ్తాయి. కోర్టులు సంవత్సరానికి 20 కేసులను మాత్రమే పరిష్కరిస్తాయి. 2023–24లో 19 కేసులు ముగిశాయి. ఇందులో 9 మందికి మాత్రమే శిక్ష పడింది. 10 మంది నిర్దోషులుగా విడుదల అయ్యారు. 2024–25లో 22 కేసులు ముగిశాయి. ఇందులో 12 మందికి శిక్ష పడగా 10 మంది నిర్దోషులుగా విడుదల అయ్యారు. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వారు నిర్దోషులుగా విడుదల కావడం గమనార్హం.
ACB Case | 17 ఏళ్లుగా పెండింగ్‌లో ..
భద్రు నాయక్‌పై ఏసీబీ 2008లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసింది. అయితే ఆ కేసు ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉండటం గమనార్హం. ప్రాసిక్యూషన్ అనుమతికే 16 నెలలు పట్టింది. 2011లో చార్జిషీట్ దాఖలు చేశారు. అతన్ని తిరిగి ఉద్యోగంలోకి తీసుకొని, పదోన్నతి కల్పించారు. ఆయన మళ్లీ లంచం తీసుకుంటూ దొరికాడు. ఇలా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఏళ్లుగా కేసులు పెండింగ్‌లో ఉండటం, కఠిన చర్యలు లేకపోవడంతోనే.. అవినీతి అధికారులు మారడం లేదు.
ACB Case | ఒకే రోజు ఇద్దరు
రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే ఇద్దరు అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కారు. ఫిర్యాదిదారుడి జీపీఎఫ్, సరెండర్ లీవ్, ఎఫ్‌టీఏ బిల్లులను తయారు చేయడానికి, మెడికల్ రీయింబర్స్మెంట్ (Medical Reimbursement) బిల్లులను సిద్ధం చేయడానికి బాసర పీహెచ్సీ సీనియర్ అసిస్టెంట్, తానూర్ పీహెచ్సీ ఇన్‌ఛార్జి భీమన్న లంచం అడిగారు. రూ.9 వేలు ఫోన్ పే ద్వారా స్వీకరించాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం లంచం అడిగిన ఆర్ఐని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఖమ్మం జిల్లా (Khammam District) కారేపల్లి ఆర్ఐ సుభా కామేశ్వరి రూ.10 వేల లంచం తీసుకుంటూ దొరికిపోయింది.
ACB Case | ఇలా చేయాలి
లంచం తీసుకుంటూ దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటే మిగతా వారు భయపడతారు. ఒక్కసారి దొరికిన వారిని శాశ్వతంగా ఉద్యోగంలో నుంచి తొలగించాలి. అది వీలు కాకుంటే సర్వీస్ మొత్తంలో ప్రమోషన్ ఇవ్వొద్దు. ఒకసారి ఏసీబీకి చిక్కిన వారిని అప్రాధాన్య పోస్టులో నియమించాలి. కేసుల విచారణ కోసం కోర్టుల సంఖ్యను పెంచాలి. వేగంగా శిక్షపడేలా చూడాలి. జైలు శిక్షను పెంచాలి. ఈ మేరకు చట్టాలు సవరించాలి. అలా అయితే అవినీతి అధికారులు మారే అవకాశం ఉంటుంది.